టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దశాబ్దకాలం తర్వాత చేదు అనుభవం ఎదురైంది. 10 ఏళ్ల తర్వాత విరాట్ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో నుంచి బయటికి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత విరాట్ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ముంబై టెస్ట్‌లో తన ట్విన్ ఫిఫ్టీలకు రివార్డ్ పొందాడు. పంత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. జో రూట్, కేన్ విలియమ్సన్ టాప్-2 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు.
స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో.. ఉస్మాన్ ఖ్వాజా, సౌద్ షకీల్, మార్నస్ లబూషేన్, కమిందు మెండిస్ తలో రెండు స్థానాలు కోల్పోయి 8 నుంచి 11 స్థానాల్లో ఉన్నారు. లంక ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే, ధనంజయ డిసిల్వ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 14, 15 స్థానాలకు ఎగబాకగా.. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి పడిపోయాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ముంబై టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తర్వాత రవీంద్ర జడేజా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఆసీస్ స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్, టీమిండియా పేసు గుర్రం బుమ్రా టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్.. ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. నాథన్ లయోన్, ప్రభాత్ జయసూర్య, నౌమన్ అలీ, మ్యాట్ హెన్రీ టాప్-10లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2 ఆల్‌రౌండర్లుగా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment