విశాఖ స్పోర్ట్స్: ఎటూ చూసినా ఎత్తైన పచ్చని కొండలు.. ఆ కొండల మధ్య పాల సముద్రాన్ని తలపించే దట్టమైన పొగమంచు అందాలు.. జాలువారే జలపాతాలు.. అలాంటి ప్రకృతి సోయగాల నడుమ పరుగు పోటీ అంటేనే ఆ మజా వేరు. కొండలు.. గుట్టలు దాటుకుంటూ.. నడవటానికి సరిగా లేని కొండవాలుపై పడుతూ..లేస్తూ.. నిర్ణీత సమయంలో లక్ష్యం చేరేందుకు ప్రకృతితో కలిసి పరుగు పెట్టారు సాహసికులు. ఇందుకు వేదికైంది వంజంగి హిల్స్.
విశాఖ ఏజెన్సీల్లోని పర్వత పంక్తుల్లో వంజంగి హిల్స్ ప్రత్యేకతే వేరు. లంబసింగి పర్వతపంక్తిలో బాగా చలి వాతావరణం ఉంటే.. వంజంగి మాత్రం కాస్త వేడి వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాంటి చోట సుమారు 115 మంది సాహసికులు ఇటీవల నిర్వహించిన 50 కిలోమీటర్ల ట్రయల్ రన్‌లో పాల్గొని.. ప్రకృతిని ఆస్వాదించారు. ఇందులో మహిళలు ఉండటం విశేషం. విభిన్నంగా సాగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి అనుభూతి.. అనుభవాలు.. వారి మాటల్లోనే..
Visakhapatnam: వంజంగి హిల్స్‌లోని రన్నర్స్ విలేజ్‌లో ప్రారంభమైన ట్రయల్‌రన్ తిరిగి అక్కడికే చేరుకోవడంతో ముగిసింది. ట్రయిల్‌రన్‌ను 11 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. ప్రతి లెగ్ నిర్ణీత సమయంలో చేరుకోవాలి. 50 కిలోమీటర్ల ట్రయల్ రన్‌లో 50 మంది, 25 కిలోమీటర్ల పరుగులో దాదాపు 65 మంది పోటీపడ్డారు. బొడ్డపుట్టు, పోతురాజుమెట్ట, సోలములు, కళ్లాలబయలు, గొందూరు, గుర్రంపణుకుల్లోని కొన్ని గ్రామాలను కలుపుతూ 50 కిలోమీటర్ల ట్రయల్‌రన్ నిర్వహించారు.
క్యాంపింగ్ స్పాట్‌లలో సేద తీరుతూ.. ఉత్సాహవంతులు కొండ గుట్టలు ఎక్కి దిగుతూ పరుగుపెట్టారు. సాధారణ మారథాన్‌లో లాగా ఇక్కడ చక్కటి ట్రాక్ ఏర్పాట్లు ఉండవు. ఒక చోట కొండవాలులోనే పరుగెత్తితే.. మరో చోట పడిపోయే స్లోప్స్‌లో బాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు.
ప్రకృతితో మమేకం
ట్రయల్ రన్ అంతా సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలోనే సాగింది. చివరి 10 కిలోమీటర్లు అక్కడ నివసించే గిరిజన తెగలతో ముచ్చట్లు, వారి ఆచార అలవాట్లను పరిచయం చేసుకుంటూ సాహసికులు మందుకు సాగారు. కొందరు సాహసికులు ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన వారు కావడంతో వారికి భాషతో ఇబ్బంది అయినా.. గిరిజనులతో హావభావాలు ప్రదర్శిస్తూ, పలకరిస్తూ సాగిపోవడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు ఉండే ఇక్కడ పరుగుతో నడక కూడా ఒక భాగమే. ఎందుకంటే అక్కడ కేవలం నడిచేందుకే మార్గం ఉంటుంది. ఇక్కడ కొందరు గాయాల పాలైనా.. గమ్యాన్ని చేరుకునే క్రమంలో వెనుకడుగు వేయలేదు.
సమయానికి రాకుంటే...
తొలి చెకింగ్ పాయింట్ 17.5 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని మూడున్నర గంటలలోపే చేరుకోవాలి. అలా చేరుకోని వారిని అక్కడే ఆపేశారు. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీటర్ల మేర జంగీ పాయింట్. బంగారుపేట వద్ద మరో పాయింట్. ఇది పది కిలోమీటర్ల సాగుతుంది. ఇదంతా అటవీప్రాంతం. ఈ మారథాన్‌లో కొందరు ట్రయల్ డిబెట్‌గా 10 కిలోమీటర్ల మేరకే పోటీ పడగా మరికొందరు హిల్ చాలెంజ్ 25 కిలోమీటర్ల మేర పోటీపడ్డారు. ఇక సాహసికులు ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో 50 కిలోమీటర్లు పూర్తి చేసి విశాఖ ట్రయల్ రన్ సంఘం నుంచి బహుమతులు అందుకున్నారు.
రూటే విభిన్నం
తొలిసారి ఈ ట్రయల్ రన్‌లో పాల్గొన్నాను. జమ్ము కశ్మీర్ నా స్వస్థలం. హాఫ్ మారథాన్‌లో శిక్షణనిస్తుంటా. కానీ నాకు ఈ పరుగు చాలా కొత్త. అసలు ఈ ట్రయల్‌రన్ రూటే చాలా విభిన్నంగా ఉంది. ఇది అంతా ఈజీ కాదు. దారివెంట గిరిజనుల జీవన విధానం ఎంతో ఆకట్టుకుంది. ఒకసారికే మేమింత కష్టపడితే.. వీరంతా ప్రతిరోజూ కొండలెక్కి దిగుతూ ఎంత శ్రమపడతారో! ఇక్కడ సహజసిద్ధంగా పారే నీటిని చేతులతో తాకకుండా తాగాం. ఇక్కడి ప్రజలు పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉన్నారు.
–కీర్తి, మహిళా విభాగం విజేత
ఎంతో శ్రమించాం
అల్ ట్రైబ్ పాడేరు పేరిట ఈ ట్రయల్ రన్ నిర్వహించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల సాహసికులు పోటీపడ్డారు. రూట్ మ్యాప్ తయారు, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడానికి నెలల వ్యవధి పట్టింది. ఇంతలో ఎన్నికలు వచ్చి కొంత ఆలస్యమైంది. పలు మార్లు రూట్‌లో ట్రయల్స్ నిర్వహించుకున్నాం. వీటీఆర్‌ఏ పేరిట చివరికి మూడు కేటగిరీల్లో పోటీ నిర్వహించి విజయవంతం చేసుకోగలిగాం. ఐటీఆర్‌ఏ పోటీలకు సమాయత్తమవుతున్నాం.
– యోగేష్, ట్రయల్ రన్ నిర్వాహకుడు
గాయాలు తగిలినా.. గమ్యాన్ని చేరాను
హైదరాబాద్ నుంచి ఆరుగురం ఈ ట్రయల్ రన్‌లో పాల్గొన్నాం. నలుగురు 25 కిలోమీటర్లు, ఒక్కరు 10 కిలోమీటర్లు, నేను 50 కిలోమీటర్ల పోటీలో పాల్గొన్నాను. నాకు గతంలో మారథాన్‌లో పాల్గొనే అనుభవం ఉంది. అదంతా రోడ్డు. ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది. అయినప్పటికీ రెండో స్థానంలో నిలిచాను. అటవీ ప్రాంతంలో మూడుసార్లు పడిపోయాను. ఒకసారి మోకాలికి గాయం అయింది. అయినా పట్టుదలతో గమ్యానికి చేరుకోగలిగాను.
తొలి లెగ్ 17.5 కిలోమీటర్లను నిర్ణీత సమయానికి అర నిముషం ముందే పూర్తి చేశాను. ఇక్కడ వెనకబడితే వెనక్కి వచ్చేయడమే. ఇక రెండో లెగ్‌లో నాలుగు నిమిషాల ముందే లక్ష్యానికి చేరుకున్నా. మూడో లెగ్‌లో రోడ్ వస్తుంది. అక్కడకు అరగంట ముందే చేరాను. 46 కిలోమీటర్ల నుంచి ముగింపు లెగ్. ఇది బాగా ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఇక్కడే పడిపోయాను.
– ఆదిత్య దేవి, ద్వితీయస్థానం, మహిళా విభాగం
రెండు సెకన్ల వ్యవధిలో...
తొలుత నేను కాంపిటీషన్ స్ప్రింట్స్‌లో పాల్గొనేవాడిని. ఆ తర్వాత లాంగ్ రన్స్‌లో వందకు పైగా కిలోమీటర్లలో తలపడ్డాను. అయితే అందుకు భిన్నమైనది ఈ ట్రయల్‌రన్. అసలు ఈ పరుగు గురించి అవగాహన లేకుండానే పోటీపడ్డాను. 25 కిలోమీటర్ల ఈవెంట్‌లో తలపడగా ద్వితీయస్థానంలో నిలిచాను. 10 కిలోమీటర్లలోపే సత్తువ అయిపోతుంది. హిల్ రౌండ్ చాలా చాలెంజింగ్. తొలి లెగ్‌లో క్వాలిఫై అయి చివరికి 3.22 నిమిషాల్లోనే పూర్తిచేయగలిగాను. రెండు సెకన్ల వ్యవధిలోనే తొలిస్థానం కోల్పోయాను. ఈ టాస్క్‌ను పడి లేస్తూనే నిర్ణీత సమయంలో పూర్తి చేయగలగడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది. – హరీష్‌మంత్రి, లాంగ్ రన్నర్
ప్రణాళికతో విజేతనయ్యా..
ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నా. దేశంలోని పలు చోట్ల నిర్వహించిన ట్రయల్స్ రన్స్‌లో పాల్గొన్నాను. ఇక్కడ జరిగిన ఈ ట్రయల్‌రన్ వాటికి భిన్నం. ఎందుకంటే ఇది రెండు ఈవెంట్ల మేళవింపు. టెక్నికల్ రౌండ్‌కు ప్రణాళిక ఉన్నా.. హిల్ రౌండ్‌లో చాలా అప్రమత్తతో ముందడుగు వేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ముందు రూట్‌ను స్టడీ చేశాను.
కొన్ని చోట్ల చాలా వేగంగా, మరికొన్ని చాలా నిదానంగా ముందుకు కదులుతూ గమ్యాన్ని చేరాను. దానికి తగ్గట్టుగానే ప్రణాళికతో 5.41 గంటల్లోనే 50 కిలోమీటర్లు పూర్తి చేయగలిగాను. ద్వితీయ స్థానంలో నిలిచిన వారి కంటే 50 నిమిషాల ముందే చేరుకోగలిగాను. తొలి లెగ్‌లోనే 350 కేలరీలు అయిపోయాయి. దారి వెంట ప్రొటీన్ ఫుడ్ తింటూనే అలసట లేకుండా ముందుకుసాగాను. దారి మధ్యలో స్థానిక గిరిజనులు ఎంతో అభిమానం చూపారు. చప్పట్లు కొడుతూ చాలా ప్రోత్సహించారు.
–సుమన్ మిశ్రా, 50 కి.మీ విజేత
Comments
Please login to add a commentAdd a comment