గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఫలితంగా గ్రూప్ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్‌వార్ట్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్ సివర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు), డానీ వ్యాట్ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
రాణించిన కెప్టెన్
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ వోల్‌వార్ట్ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్‌వార్ట్, తజ్‌మీన్ బ్రిట్స్ (19 బంతుల్లో 13; 1 ఫోర్)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్ బాష్ (26 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్న
వోల్‌వార్ట్‌ను ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కెప్టెన్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్ చివర్లో డెర్క్‌సెన్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.
కీలక భాగస్వామ్యం...
షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరిగినా... వ్యాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.
ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్ గెలుపు గీత దాటింది.
విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్ వెనుదిరగ్గా... బ్రంట్ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్ తలపడుతుంది.
ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు
వేదిక- షార్జా
టాస్- సౌతాఫ్రికా.. బ్యాటింగ్
సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)
ఇంగ్లండ్ స్కోరు: 125/3 (19.2)
ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.
Comments
Please login to add a commentAdd a comment