తన చివరి టెస్ట్‌కు ముందు అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్న వార్నర్‌ | David Warner Makes Plea For Return Of His Missing Baggy Green | Sakshi
Sakshi News home page

తన చివరి టెస్ట్‌కు ముందు అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్న వార్నర్‌

Published Tue, Jan 2 2024 3:58 PM | Last Updated on Tue, Jan 2 2024 4:43 PM

Warner Makes Plea For Return Of His Missing Baggy Green - Sakshi

తన కెరీర్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్నాడు. వార్నర్‌ తన కెరీర్‌లో మెజార్టీ శాతం ధరించిన బ్యాగీ గ్రీన్‌ (క్యాప్‌) కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియన్‌గా తనకు బ్యాగీ గ్రీన్‌ అతి మూల్యమైన వస్తువని, ఎవరైనా దాన్ని తీసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని సోషల్‌మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు.

పాకిస్తాన్‌తో మూడో టెస్ట్‌కు ముందు మెల్‌బోర్న్‌ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన బ్యాగీ గ్రీన్‌ మిస్‌ అయినట్లు అనుమానిస్తున్నాడు. ఈ విషయమై అతను ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో వార్నర్‌ బ్యాగీ గ్రీన్‌ దొంగిలించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వివరణ ఇచ్చారు. తనకు ఎంతో ప్రత్యేకమైన క్యాప్‌ కనపడకపోవడంతో వార్నర్‌ తెగ బాధపడిపోతున్నాడు.

సోషల్‌మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. నా కెరీర్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే ముందు బ్యాగీ గ్రీన్‌ను మిస్‌ అయ్యాను. దయచేసి ఎవరికైనా అది దొరికి ఉంటే తిరిగి ఇచ్చేయండని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు ప్రతిగా ఎదైనా ఇచ్చేందుకు కూడా తాను సిద్దమేనని అభ్యర్ధించాడు. క్యాప్‌ను తిరిగి ఇచ్చే వారిపై ఎలాంటి కంప్లైంట్‌ కూడా ఇవ్వనని హామీ ఇచ్చాడు.

బ్యాగీ గ్రీన్‌ దొరికిన వారు తనను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించవచ్చని లేదా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనైనా మాట్లాడవచ్చని మెసేజ్‌ పాస్‌ చేశాడు. కాగా, వార్నర్‌ తన 111 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో ఎక్కువ శాతం మ్యాచ్‌లు ఇప్పుడు పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌తోనే ఆడాడట. ఈ క్యాప్‌ వార్నర్‌కు చాలా కలిసొచ్చిందిగా చెబుతారు. మెల్‌బోర్న్‌ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన రెండు బ్యాగీ గ్రీన్‌లతో కూడిన లగేజ్‌ చోరీకి గురైందని వార్నర్‌ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పాకిస్తాన్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ కూడా స్పందించడం విశేషం. 

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకుని, వార్నర్‌ పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌ను వెతికపెట్టాలని మసూద్‌ కోరాడు. ఇందుకోసం దేశవ్యాప్తంగా శోధన జరగాలని పిలుపునిచ్చాడు. అవసరమైతే డిటెక్టివ్‌ల సాయం కూడా తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌కు వార్నర్‌ గొప్ప ప్రతినిధి అని, అలాంటి వ్యక్తికి చెందిన అతి మూల్యమైన వస్తువు పోతే ప్రభుత్వం స్పందించాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement