
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తనదైన స్టైల్‌లో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు.
టెస్టుల్లో తనొక బ్రాండ్ అని మరోసారి రిషబ్ నిరూపించుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భయంకరమైన కారు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ తన మార్క్ చూపించిన పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ చేరాడు. పంత్ తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాలని అక్రమ్ హెచ్చరించాడు.
"రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా అద్భుతం చేశాడన్పిస్తోంది. అంతటి ప్రమాదం నుంచి కోలుకుని అతడు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అతడి కారు ప్రమాదం జరిగిన తీరును చూసి పాకిస్తాన్‌లో మేమంతా ఆందోళన చెందాము. అందులో నేను కూడా ఉన్నాను.
అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేశాను. టెస్టుల్లో పంత్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆస్ట్రేలియా గడ్డపై అతడి సెంచరీ, ఇంగ్లండ్‌పై బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం పంత్ రివర్స్ స్వీప్ ఆడాడు. ఇందులో అతడిని మించినవారే లేరు.
రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరైనా సరే కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతోంది. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పంత్ మాత్రం చాలా తక్కువ వ్యవధిలోనే తన ఫిట్‌నెస్‌ను సాధించాడు. పంత్ కథను తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఐపీఎల్ రీఎంట్రీలోనూ సత్తాచాటాడు.
40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాణించాడు. అనంతరం తనకు ఇష్టమైన రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ మెరిశాడు. పంత్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది. అతడిని ఆపేందుకు ఆసీస్ ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని " అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment