భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ వేటలో ఉంది. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే నాటికి రాహుల్ ద్రవిడ్ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి సరైన వ్యక్తి ఇతడేనంటూ ఓ మాజీ క్రికెటర్ పేరును ప్రతిపాదించాడు. ఇంతకీ అతడు ఎవరు?..
టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచింది.
అయితే, టీ20 ప్రపంచకప్-2022, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.
ఇక వన్డే వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే, ఈ మెగా టోర్నీ అనంతరం అతడు తన పదవి నుంచి తప్పుకోనుండగా.. అభ్యర్థుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
మరోవైపు.. విదేశీ కోచ్‌ల నియామకానికి బీసీసీఐ సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘టీమిండియా హెడ్‌కోచ్‌గా అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే గౌతం గంభీర్ అనే చెప్తా. గౌతం ఈ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది అతడి ఇష్టం.
నిజానికి గౌతం ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశాడు. తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హెడ్‌కోచ్ విషయానికొస్తే.. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తను ఇది ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి.
గౌతం గంభీర్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. రెండో మాటకు తావులేకుండా సూటిగా చెప్తాడు. నిజానికి టీమిండియా క్రికెట్ కల్చర్‌కు ఇది విరుద్ధం.
కానీ గంభీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఏదేనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి దూకుడు ఎక్కువ. జట్టును కూడా తనలాగే అగ్రెసివ్‌గా తయారుచేయగలడు. నిజంగా తను కోచ్‌గా వస్తే బాగుంటుంది. కానీ అందుకు అతడు ఒప్పుకొంటాడో లేదో?!’’ అని వసీం అక్రం స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.
కాగా గంభీర్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక కేకేఆర్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment