ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకు ముందు భారత జట్టుకు సారథ్యం వహించిన ఆటగాళ్లెవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. కాగా భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2011 ఫైనల్లో ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకను చిత్తు చేసి నాటి జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరోసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది భారత్.
ఈ క్రమంలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఏ వేదిక మీదైతే టైటిల్ గెలిచిందో అదే వేదిక మీద తాజా వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
కాగా వాంఖడే రోహిత్ శర్మకు సొంతమైదానం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ చరిత్రలో అతడు అరుదైన ఘనత సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో వరల్డ్‌కప్ టోర్నీలో హోంగ్రౌండ్‌లో సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు.
1983లో తొలిసారి టీమిండియాకు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన కపిల్ దేవ్ 1987లోనూ కెప్టెన్‌గానూ ఉన్నాడు. అయితే, అప్పుడు భారత్‌లోనే ఐసీసీ ఈవెంట్ జరిగినప్పటికీ కపిల్ దేవ్ స్వస్థలం చండీగఢ్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇక వరల్డ్‌కప్-1996లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా కూడా అజారుద్దీన్ సొంత మైదానం హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. అదే విధంగా 2011 ప్రపంచకప్ టోర్నీలోనూ ధోని స్వస్థలం రాంచిలోనూ భారత జట్టు మ్యాచ్ ఆడలేదు. నిజానికి 2013 తర్వాత అక్కడ తొలి అంతర్జాతీయ స్టేడియం నిర్మించారు.
చదవండి: వారసత్వాన్ని నిలబెడతాడని తండ్రికి నమ్మకం! వివాదాలు చుట్టుముట్టినా..
Comments
Please login to add a commentAdd a comment