WC 2023: ఎదురులేని న్యూజిలాండ్‌..బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్‌ కొట్టిన కివీస్‌ | WC 2023: New Zealand Beat Bangladesh By 8 Wickets Hatrick Win | Sakshi
Sakshi News home page

WC 2023: ఎదురులేని న్యూజిలాండ్‌..బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్‌ కొట్టిన కివీస్‌

Published Fri, Oct 13 2023 9:41 PM | Last Updated on Fri, Oct 13 2023 10:01 PM

WC 2023: New Zealand Beat Bangladesh By 8 Wickets Hatrick Win - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది.

చెలరేగిన ఫెర్గూసన్‌
చెన్నైలోని చెపాక్‌ వేదికగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. షకీబ్‌ అల్‌ హసన్‌ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి బంతికే కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ను డకౌట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ 16 పరుగులకే నిష్క్రమించగా.. మెహిదీ హసన్‌ మిరాజ్‌ 30, షకీబ్‌ 40, ముష్ఫికర్ రహీం 66 పరుగులతో రాణించారు.

ఆఖర్లో మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 2, మ్యాట్‌ హెన్రీ 2, లాకీ ఫెర్గూసన్‌ 3, సాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

సమిష్టిగా రాణించి
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడింది కివీస్‌. ఓపెనర్‌గా వచ్చిన రచిన్‌ రవీంద్ర 9 పరుగులకే అవుట్‌ కాగా.. డెవాన్‌ ​కాన్వే(45)తో కలిసి కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.

వచ్చీ రాగానే కేన్‌ మామ మళ్లీ
నాలుగో స్థానంలో వచ్చిన డారిల్‌ మిచెల్‌ 67 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో అడుగుపెట్టిన కేన్‌ మామ.. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో 42.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన కివీస్‌ 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టింది. లాకీ ఫెర్గూసన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement