సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ మూడు సెంచరీలు బాదాడు. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకపై శతక్కొట్టిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 109 పరుగులు సాధించాడు.
ఇలా మెగా టోర్నీ మొదట్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే, బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు డికాక్. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
అద్భుతమైన షాట్లతో అలరిస్తూ ప్రేక్షకులకు టీ20 మాదిరి వినోదం అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసిన డికాక్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
కాగా శరీరం సహకరించకపోవడం.. ఇకపై లీగ్ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి సారించే క్రమంలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు క్వింటన్ డికాక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు.. టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ తెలియజేశాడు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి బ్యాటింగ్ సూపర్. తన అద్భుతమైన నైపుణ్యాలతో అదరగొట్టాడు.
నేనైతే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ పిటిషన్ సమర్పించాలనుకుంటున్నా. వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత డికాక్ రిటైర్ అవకుండా చూడాలని హామీ ఇమ్మని కోరతా. ఎందుకంటే.. అతడు రిటైర్ అయిపోతే.. 50 ఓవర్ల క్రికెట్‌లో ఇలాంటి మజాను మనకు ఎవరు అందిస్తారు?’’ అంటూ కామెంటేటర్ మంజ్రేకర్ సౌతాఫ్రికా బ్యాటర్‌ను ఆకాశానికెత్తాడు.
ఇందుకు స్పందించిన మరో కామెంటేటర్, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం.. ‘‘అవును.. తను వయసులో ఇంకా చిన్నవాడే. అంతేకాదు.. కెరీర్‌లో ఇప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడు.
కానీ ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో డికాక్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నువ్వు పిటిషన్ వేస్తానంటే నేను కూడా దానిపై తప్పకుండా సంతకం చేస్తా’’ అని సంజయ్ మంజ్రేకర్‌తో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ముంబై మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment