Sehwag's epic take on Kohli lifting Sachin Tendulkar on shoulders: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011లో ధోని సేన అద్భుతం చేసింది. దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.
ఆ విన్నింగ్ సిక్సర్
ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విన్నింగ్ సిక్సర్‌ను ఎవరూ అంతతేలికగా మర్చిపోరు. అదే విధంగా చాంపియన్‌గా నిలిచిన అనంతరం సచిన్ టెండుల్కర్‌ను భుజాల మీద ఊరేగిస్తూ ఘనంగా సత్కరించుకున్న తీరు కూడా సగటు అభిమాని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
కోహ్లి భుజాలపై సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతిలో జాతీయ జెండా రెపరెపలాడిస్తుండగా.. నాటి కుర్ర బ్యాటర్ విరాట్ కోహ్లి అతడిని భుజాల మీద మోశాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్ తదితరులు అతడికి సాయం అందించారు. మరుపురాని ఈ దృశ్యాలు నెమరువేసుకున్నడప్పుల్లా అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతాయనడంలో సందేహం లేదు.
ఇక ఇప్పుడు.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్‌ను భుజాలపై ఊరేగించిన ఘటన గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు.
సచిన్‌ను మోయడం మావల్ల కాదు బాబోయ్!
‘‘సచిన్‌ను మోయడం మావల్ల కాదని చేతులెత్తేశాం. ఎందుకంటే సచిన్ చాలా బరువుగా ఉంటాడు కదా! అసలే అప్పటికే మేం ముసలోళ్లం. మాకు భుజం నొప్పులు.. ధోనికేమో మోకాలి సమస్యలు.. మిగతా వాళ్లకు మరేవో ఇబ్బందులు..
అందుకే కోహ్లి అలా
అందుకే భారమంతా యువ ఆటగాళ్లపైనే వేశాం. మీరు వెళ్లి సచిన్ టెండుల్కర్‌ను ఎత్తుకోండి అని చెప్పాం. అందుకే విరాట్ కోహ్లి ఆ పని చేశాడు’’ అని వీరూ భాయ్ సరదాగా చెప్పుకొచ్చాడు.
కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న వన్డే వరల్డ్‌కప్-2023 రోహిత్ సేనకు ప్రతిష్టాత్మకంగా మారింది. సొంతగడ్డపై మెగా టోర్నీ నేపథ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈసారి ఏం జరుగుతుందో?!
ఇక 1983లో తొలిసారి ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. 2019లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రెండుసార్లు చేరుకున్నప్పటికీ తుదిపోరులో చేతులెత్తేసింది.
చదవండి: WC 2023: ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: టీమిండియా మాజీ కెప్టెన్
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
Comments
Please login to add a commentAdd a comment