నేపాల్‌ క్రికెట్‌ బోర్డు పేదరికం.. విండీస్‌ క్రికెటర్లకు ఊహించని కష్టాలు | West Indies A Cricket Team Landed In Nepal For 5 Match T20 Series | Sakshi
Sakshi News home page

నేపాల్‌ క్రికెట్‌ బోర్డు పేదరికం.. విండీస్‌ క్రికెటర్లకు ఊహించని కష్టాలు

Published Thu, Apr 25 2024 4:50 PM | Last Updated on Thu, Apr 25 2024 4:52 PM

West Indies A Cricket Team Landed In Nepal For 5 Match T20 Series

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌-ఏ క్రికెట్‌ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది.  ఈ నెల (ఏప్రిల్‌) 27 నుంచి వచ్చే నెల (మే) 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో విండీస్‌-నేపాల్‌ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్నాయి. కిరీటీపూర్‌ వేదికగా జరిగే ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 27, 28, మే 1, 2, 4 తేదీల్లో జరుగనుంది. విండీస్‌ క్రికెట్‌ బోర్డు నేపాల్‌ సిరీస్‌ను వరల్డ్‌కప్‌ సన్నాహకంగా భావించి పూర్తి స్థాయి జట్టును అక్కడికి పంపింది.

ఐపీఎల్‌తో బిజీగా ఉ‍న్న క్రికెటర్లు మినహా మిగతా జట్టంతా నేపాల్‌ పర్యటనకు వచ్చింది. విండీస్‌ క్రికెటర్లు నిన్ననే నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ల్యాండ్‌ అయ్యారు. అయితే ఖాట్మండు విమానాశ్రయంలో విండీస్‌ క్రికెటర్లకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. నేపాల్‌ క్రికెట్‌ బోర్డు విండీస్‌ క్రికెటర్లకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లుకు స్వాగతం పలికే నాథుడు కూడా లేకుండా పోయాడు.

నిధులలేమితో కొట్టిమిట్టాడుతున్న నేపాల్‌ క్రికెట్‌ బోర్డు విండీస్‌ క్రికెటర్లకు కనీస రవాణా సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. క్రికెటర్లు సాధారణ బస్సులో బస చేసే ప్రదేశానికి బయల్దేరారు. నేపాల్‌ క్రికెట్‌ బోర్డు దీనస్థితి ఎంతలా ఉందంటే.. విండీస్‌ క్రికెటర్ల లగేజీని మోసుకెళ్లేందుకు ట్రాలీ ఆటో లాంటి ఆతి సాధారణ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. విండీస్‌ ఆటగాళ్లు ఎవరి లగేజీని వాళ్లే మోసుకెళ్లి ట్రాలీలో పెట్టుకున్నారు.

ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కొందరు నేపాల్‌ క్రికెట్‌ బోర్డు పరిస్థితిని చూసి జాలి పడుతుంటే.. మరికొందరు మీమ్స్‌కు వాడుకుంటున్నారు.

కాగా, వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు పరిస్థితి కూడా గతంలో నేపాల్‌ క్రికెట్‌ బోర్డు పరిస్థితి మాదిరే ఉండేది. ఆ జట్టు క్రికెట్‌ బోర్డు కూడా పేదరికంతొ కొట్టిమిట్టాడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. విండీస్‌ క్రికెట్‌ బోర్డుకు ఎలాగోలా నిధులు సమకూరుతున్నాయి. అందుకే ఆ జట్టు యూఎస్‌ఏతో కలిసి ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వగలుగుతుంది. నేపాల్‌ క్రికెట్‌ బోర్డు విషయానికొస్తే.. ఆ దేశ ‍క్రికెట్‌ బోర్డు ఆటగాళ్లకు జీతాలు ఇవ్వలేకపోతుంది. కనీసం​ కిట్లు కూడా సమకూర్చలేకపోతుంది. దీనస్థితిలో ఉన్న నేపాల్‌ క్రికెట్‌ను బీసీసీఐ లాంటి సంపన్న బోర్డులు ఆదుకోవాలి. 

నేపాల్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్-ఏ క్రికెట్‌ జట్టు: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), అలిక్ అథనాజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, కడీమ్ అలీన్, జాషువా బిషప్, కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మార్క్ దేయల్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డ్, ఒబెడ్ మెకాయ్ , గుడకేష్ మోటీ, కీమో పాల్, ఒషానే థామస్, హేడెన్ వాల్ష్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement