పాకిస్తాన్‌ విజయ లక్ష్యం 254 | West Indies Set Pakistan A Target Of 254 In 2nd Test | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ విజయ లక్ష్యం 254

Published Sun, Jan 26 2025 4:42 PM | Last Updated on Mon, Jan 27 2025 8:18 AM

West Indies Set Pakistan A Target Of 254 In 2nd Test

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 9 పరుగుల లీడ్ కలుపుకుని విండీస్‌ పాకిస్తాన్‌ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్‌ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్‌ ఇమ్లాచ్‌ (35), కెవిన్‌ సింక్లెయిర్‌ (28), గుడకేశ్‌ మోటీ (18), గోమెల్‌ వార్రికన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌, నౌమన్‌ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్‌ అలీ, అబ్రార్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్‌ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్‌ వార్రకన్‌ 4, గుడకేశ్‌ మోటీ 3, కీమర్‌ రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్‌ షకీల్‌ 32 పరుగులు చేశాడు. షాన్‌ మసూద్‌ 15, ముహమ్మద్‌ హురైరా 9, బాబర్‌ ఆజమ్‌ 1, కమ్రాన్‌ గులామ్‌ 16, సల్మాన్‌ అఘా 9, నౌమన్‌ అలీ 0, సాజిద్‌ ఖాన్‌ 16 (నాటౌట్‌), అబ్రార్‌ అహ్మద్‌ 2, కషిఫ్‌ అలీ డకౌటయ్యారు.

విండీస్‌ పరువు కాపాడిన చివరి ముగ్గురు బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 163 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదుకున్నారు. గడకేశ్‌ మోటీ 55, కీమర్‌ రోచ్‌ 25, గోమెల్‌ వార్రికన్‌ 36 (నాటౌట్‌) పరుగులు చేశారు. నౌమన్‌ అలీ (6/41) విండీస్‌ను ఆరేశాడు. సాజిద్‌ ఖాన్‌ 2, అబ్రార్‌ అహ్మద్‌, కషిఫ్‌ అలీ తలో వికెట్‌ తీశారు.

కష్టాల్లో పాక్‌
255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (2), ముహమ్మద్‌ హురైరా (2), కమ్రాన్‌ గులామ్‌ (19) నిరాశపరిచారు. బాబర్‌ ఆజమ్‌ (26), సౌద్‌ షకీల్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల అనంతరం పాక్‌ స్కోర్‌ 59/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలవాలంటే మరో 195 పరుగులు చేయాలి. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీ, కెవిన్‌ సింక్లెయిర్‌, జోమెల్‌ వార్రికన్ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement