100 పరుగుల లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో ఛేదించిన మాజీ చాంపియన్
స్కాట్లాండ్‌కు రెండో ఓటమి
చినెల్లి ఆల్‌రౌండ్ ప్రదర్శన
దంచేసిన క్వినా, డాటిన్
దుబాయ్: మాజీ చాంపియన్ వెస్టిండీస్ మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలుపు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో సఫారీ చేతిలో ఓడిన 2016 చాంపియన్ ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్లు సారా బ్రిస్ (2), సస్కియా హార్లీ (11)లను ఆరంభంలోనే అవుట్ చేయడంతో స్కాట్లాండ్ తిరిగి పుంజుకోలేకపోయింది.
వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేథరిన్ బ్రిస్ (31 బంతుల్లో 25; 1 ఫోర్), అయిల్సా లిస్టెర్ (33 బంతుల్లో 26; 1 ఫోర్) కాసేపు క్రీజులో నిలబడటంతో స్కాట్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కరీబియన్ బౌలర్లలో అఫీ ఫ్లెచెర్ 3 వికెట్లు తీయగా, చినెల్లి హెన్రీ, హేలీ మాథ్యూస్, కరిష్మా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే ఓపెనర్లు స్టెఫానీ టేలర్ (4), హేలీ మాథ్యూస్ (8) వికెట్లను కోల్పోయి తడబడింది.
అయితే క్వినా జోసెఫ్ ( 18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), చినెల్లి హెన్రీ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆట ఆడి వేగంగా మ్యాచ్‌ను ముగించారు. దీంతో విండీస్ 11.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. ఒలివియా బెల్‌కు 2 వికెట్లు దక్కాయి. రాచెల్, ప్రియనాజ్ ఛటర్జీ చెరో వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: హార్లీ (సి) డాటిన్ (బి) హేలీ మాథ్యూస్ 11; సారా బ్రిస్ (బి) హెన్రీ 2; కేథరిన్ బ్రిస్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 25; లిస్టెర్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 26; ప్రియనాజ్ ఛటర్జీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫ్లెచర్ 0; జాక్ బ్రౌన్ (రనౌట్) 11; డార్సీ కార్టర్ (నాటౌట్) 14; కేథరిన్ ఫ్రేజర్ (రనౌట్) 6; రాచెల్ (బి) కరిష్మా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–59, 4–59, 5–76, 6–76, 7–98, 8–99. బౌలింగ్: హెన్రీ 4–2–10–1, హేలీ మాథ్యూస్ 4–0–21–1, కరిష్మా 4–0–24–1, అశ్మిని మునిసర్ 1–0–8–0, అఫీ ఫ్లెచర్ 4–0–22–3, క్వినా జోసెఫ్ 1–0–2–0, ఆలియా అలెన్ 2–0–10–0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) కేథరిన్ బ్రిస్ (బి) ప్రియనాజ్ 8; స్టెఫానీ (బి) రాచెల్ 4; క్వినా జోసెఫ్ (సి) ప్రియనాజ్ (బి) ఒలివియా బెల్ 31; షెర్మయిన్ (సి అండ్ బి) ఒలివియా బెల్ 2; డాటిన్ (నాటౌట్) 28; చినెల్లి హెన్రీ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (11.4 ఓవర్లలో 4
వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–48, 4–59. బౌలింగ్: రాచెల్ స్లేటర్ 2–0–17–1, కేథరిన్ బ్రిస్ 3–0–22–0, ఒలివియా బెల్ 3–0–18–2, ప్రియనాజ్ 1–0–15–1, అబ్తాహ మక్సూద్ 2.4–0–28–0.
Comments
Please login to add a commentAdd a comment