విశాఖలో 1988లో జరిగిన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ మొదలుకుని.. ఇటీవల జరిగిన టీ–20 మ్యాచ్ వరకు.. ఎన్నెన్నో జ్ఞాపకాలకు విశాఖ క్రీడాభిమాని హృదయం నిలయం. క్రికెట్ గురించి ప్రస్తావిస్తే చాలు మనసు తెర మీద చిటికెలో ప్రత్యక్షమయ్యే అద్భుతాల చిత్రాలు.. ఇక్కడ అభిమానులను అనంతానందాల వెల్లువలో మునకలేయిస్తాయన్నది వైఎస్సార్ స్టేడియం సాక్షిగా తిరుగులేని నిజం.
ఈ సంతోషాల పరంపరలో మరో మహత్తర ఘట్టం శుక్రవారం ఆవిష్కృతం కానుంది. సిరీస్‌లో 0–1తో వెనుకబడిన టీమిండియాకు ఈ టెస్ట్ మ్యాచ్ ఎంతో కీలకం. అచ్చొచ్చిన స్టేడియంలో విజయం సాధిస్తే.. చరిత్ర పుటల్లో మరోసారి విశాఖ పేరు లిఖితం కానుంది.
ఆతిథ్య భారత్ జట్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఫేవరేట్ మైదానం. గతంలో ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్.. ముచ్చటగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది.
గతంలో ఇదే వేదికపై 2016లో తొలిసారిగా ఇంగ్లండ్‌తో భారత్ తలపడి విజయం సాధించింది. 2019లో దక్షిణాఫ్రికా జట్టు తో జరిగిన మ్యాచ్‌లో విజేత కేతనం ఎగురవేసింది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ 0–1తో తొలి టెస్ట్‌ను కోల్పోగా.. రెండో మ్యాచ్‌లో విజయ మే లక్ష్యంగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. రెండు రోజుల పాటు ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.
ఆధిక్యాన్ని కొనసాగించేందుకు ఇంగ్లండ్, లెక్క సరిచేసేందుకు భారత్ ప్రణాళికలతో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. తొలి టెస్ట్‌లో రివర్స్ స్వీప్‌తో ఇంగ్లండ్ జట్టు భారత్ బౌలర్లకు చుక్కలు చూపించి బజ్‌బాల్ ఫార్ములాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు ఫీల్డింగ్ లోపాలతో క్యాచ్‌లు జారవిడవడంతో భారత్ గెలుపునకు చేరువై తొలి టెస్ట్ కోల్పోయింది.
గడిచిన రెండు రోజుల్లో ఇలాంటి లోపాలను సరిదిద్దుకుని పూర్తి సంసిద్ధతతో ఉన్నామని జట్టు సభ్యులు చెప్పడంతో విశాఖ మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తి పెంచుకున్నారు. విరాట్ కోహ్లీ విశాఖ మ్యాచ్‌కు సెలవు తీసుకోగా.. తొలిటెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్ కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తొడకండరాలు పట్టేడయంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు.
వీరి స్థానాల్లో మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, స్పిన్ ఆల్‌రౌండర్ సౌరభ్‌కుమార్‌లతో పాటు బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. వీరంతా విశాఖలో జోరుగా ప్రాక్టీస్ చేశారు. విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో గతంలో ఇదే వేదికపై జరిగిన ఇంగ్లండ్–భారత్ టెస్ట్ మ్యాచ్ రెండు రోజులకే ముగిసింది. విశాఖలోని సెంటర్ పిచ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేది అయినా శని, ఆదివారాల్లో స్పిన్‌కు సహకరించే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం.
ఇంగ్లండ్ తరఫున షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనుండగా హార్ట్‌లీ, రెహాన్‌లు తోడు కానున్నారు. స్పిన్నర్ జాక్‌లీచ్ మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. భారత్ యువబ్యాటర్లు తొలి టెస్ట్‌లో.. అందునా రెండో ఇన్నింగ్స్‌లో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. గతంలో ఇదే వేదికపై రెండు టెస్ట్ సెంచరీలు సాధించిన రోహిత్ ఈ సారి ఓపెనర్ గానే కాక జట్టును సమష్టిగా ముందుకు నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్ బుమ్రా ఆది నుంచే ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తాడనే దానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇక ఇదే వేదికపై భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి.. విజయం సాధించింది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
చదవండి: IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్!?
Comments
Please login to add a commentAdd a comment