రోహిత్ శర్మ - మహేంద్ర సింగ్ ధోని
Team India Captain: టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. జట్టులోకి వచ్చిన దాదాపు మూడేళ్ల కాలంలోనే సారథిగా పగ్గాలు చేపట్టి అనేకానేక విజయాలు అందించాడు. ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు.
ఇక ధోని తర్వాత అతడి వారసుడిగా విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతలు స్వీకరించి తనదైన ముద్ర వేయగలిగాడు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాను చాంపియన్‌గా నిలపలేకపోయినప్పటికీ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు.
ధోని వారసుడిగా కోహ్లి
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. అనూహ్య రీతిలో వన్డే సారథిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పగా... రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడయ్యాడు.
రోహిత్ ఇలా
ఇక హిట్‌మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో కెప్టెన్ అద్భుతంగా రాణించినప్పటికీ ఆసియా కప్-2022, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీల్లో ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలైంది.
రోహిత్ వద్దే వద్దంటూ
ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఖాయమని వార్తలు వినిపిస్తుండగా.. టెస్టుల్లో రోహిత్‌కు సరైన వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు నడుస్తున్నాయి.
నాడు బీసీసీఐ ధోనిని కెప్టెన్ ఎందుకు చేసిందంటే
ఈ క్రమంలో ఓ ఆటగాడిని సారథిగా నియమించే ముందు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం, ధోని తక్కువ కాలంలోనే ఎలా కెప్టెన్ అయ్యాడన్న విషయంపై మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘జట్టులోని సీనియర్లలో ఎవరో ఒకరిని ఆటోమేటిక్ ఆప్షన్‌గా తీసుకునే బదులు.. ఆట పట్ల సదరు క్రికెటర్‌కు ఉన్న అవగాహన, శక్తిసామర్థ్యాలు, చాతుర్యత, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుకు నడిపించగల సత్తా, మేనేజ్‌మెంట్ స్కిల్స్.. ఇవన్నీ గమనిస్తాం.
నాడు ధోనిలో ఇవన్నీ చూసిన తర్వాతే అతడి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. ఆట పట్ల అతడి ఆలోచనా ధోరణి, ఇతరులతో మమేకమయ్యే విధానం.. వీటితో పాటు ధోని విషయంలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్.. అతడిని సారథిగా నియమించేందుకు దోహదం చేశాయి’’ అని భూపీందర్.. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెల రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన మొదలుపెట్టనుంది.
చదవండి: లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు
#MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్'
Comments
Please login to add a commentAdd a comment