అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు! | Why Shreyas Iyer and Shami Not Selected in India Vs Bangladesh Test Squad | Sakshi
Sakshi News home page

Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!

Published Mon, Sep 9 2024 12:54 PM | Last Updated on Mon, Sep 9 2024 1:23 PM

Why Shreyas Iyer and Shami Not Selected in India Vs Bangladesh Test Squad

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీ కానుంది. చివరిసారిగా.. శ్రీలంక పర్యటన సందర్భంగా ఆగష్టు 7న వన్డే మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ సేన.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆదివారమే తొలి టెస్టుకు జట్టును కూడా ప్రకటించింది.

ఈ సిరీస్‌ ద్వారా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ పునరాగమనం చేయనుండగా.. కేఎల్‌ రాహుల్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌ యువ పేసర్‌ యశ్‌ దయాల్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.

ఐపీఎల్‌ టీమ్‌ను చాంపియన్‌గా నిలిపి
అయితే, ఈ జట్టులో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. రంజీల్లో ఆడాలన్న ఆదేశాలను బేఖాతరు చేశాడంటూ క్రమశిక్షణ చర్యల కింద గతంలో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. అయితే, ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబై ప్లేయర్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్‌ సందర్భంగా బీసీసీఐ అవకాశమిచ్చింది.

ఈ క్రమంలో రెడ్‌బాల్‌ జట్టులో కూడా చోటు దక్కించుకోవాలన్న లక్ష్యంతో బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ ఆడాడు. అయితే, అక్కడ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అనంతరం దులిప్‌ ట్రోఫీ-2024 బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇండియా- డి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం
ఇండియా-సితో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. అయితే, సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ ఆటలో నిలకడలేని కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో మరో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు పిలుపునివ్వడం విశేషం. కాగా కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

అందుకే షమీని కూడా తీసుకోలేదు!
ఇక అయ్యర్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు టీమిండియా సీనియర్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీని కూడా ఎంపికచేయలేదు సెలక్టర్లు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడు. అయితే, అతడిని హడావుడిగా జట్టుకు ఎంపిక చేసి రిస్క్‌ తీసుకోవడం ఎందుకని బీసీసీఐ భావించినట్లు సమాచారం. 

ప్రధాన పేసర్‌ బుమ్రా అందుబాటులో ఉండటం, సొంతగడ్డపై అదీ బంగ్లాదేశ్‌ వంటి జట్టుతో సిరీస్‌ నేపథ్యంలో షమీని వెంటనే పిలిపించాల్సిన అవసరం లేదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అతడి స్థానంలో యశ్‌ దయాల్‌కు చోటిచ్చినట్లు సమాచారం. ఇక రంజీల్లో బెంగాల్‌ తరఫున షమీ ఒక మ్యాచ్‌ ఆడిన తర్వాత అతడిని న్యూజిలాండ్‌తో సిరీస్‌ నాటికి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషభ్‌ పంత్, ధ్రువ్‌ జురెల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, మహమ్మద్‌ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ దయాల్‌.  

చదవండి: Duleep Trophy: రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్‌.. ఆ జట్టు నుంచి పిలుపు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement