బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు వచ్చింది.
ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్‌ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.
అనంతరం.. సెయింట్ కిట్స్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది.
స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ తాంజిద్ హసన్(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్ తంజీమ్ హసన్ సకీబ్ 45 పరుగులతో రాణించాడు.
స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్ బ్యాట్ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్
ఇక విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు సాధించాడు.
మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ 49 రన్స్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ షాయీ హోప్(17)తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఏడు వికెట్ల తేడాతో గెలిచి
ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్ పేసర్ జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్- విండీస్ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.
చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు
Comments
Please login to add a commentAdd a comment