WI VS ENG 2nd ODI: అరుదైన క్లబ్‌లో చేరిన జోస్‌ బట్లర్‌ | Sakshi
Sakshi News home page

WI VS ENG 2nd ODI: అరుదైన క్లబ్‌లో చేరిన జోస్‌ బట్లర్‌

Published Thu, Dec 7 2023 12:18 PM

WI VS ENG 2nd ODI: Jos Buttler Becomes Fifth England Batter To Cross 5000 Runs In ODIs - Sakshi

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అరుదైన క్లబ్‌లో చేరాడు. వెస్టిండీస్‌తో నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన రెండో వన్డేలో మెరుపు అర్ధసెంచరీ (45 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు, 3సిక్సర్లు) సాధించిన బట్లర్‌.. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌ తరఫున 5000 పరుగుల మార్కును దాటిన ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు ఇయాన్‌ మోర్గన్‌ (6957), జో రూట్‌ (6522), ఇయాన్‌ బెల్‌ (5416), పాల్‌ కాలింగ్‌పుడ్‌ (5092), జోస్‌ బట్లర్‌ (5022) ఇంగ్లండ్‌ తరఫున ఐదు వేల పరుగుల మార్కును దాటారు. 

బట్లర్‌ మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో రెండో వన్డేలో ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ తొలి వన్డేలో విండీస్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్‌ కర్రన్‌, లివింగ్‌స్టోన్‌ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (68), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్‌ను గెలిపించిన హోప్‌ ఈ మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. విల్‌ జాక్స్‌ (73), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (58 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్‌, బట్లర్‌లతో పాటు హ్యారీ బ్రూక్‌ (43 నాటౌట్‌) కూడా రాణించాడు. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్‌ 9న జరుగనుంది.
 

Advertisement
Advertisement