
టెస్ట్ క్రికెట్‌ను ఆస్వాదించే భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి తర్వాత మరో ఐదు నెలల పాటు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడదు. ఫిక్సడ్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం భారత్ మరో ఐదు నెలల పాటు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతుంది.
విండీస్‌లో ఇవాళ (రెండో టెస్ట్ ఆఖరి రోజు) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసాక భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆతర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత అటునుంచటే నేరుగా ఐర్లాండ్‌కు వెళ్లి అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది.
దీని తర్వాత ఆగస్ట్ 30-సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్, ఆ తర్వాత అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్, అటు పిమ్మట డిసెంబర్ 10 నుంచి 21 వరకు సౌతాఫ్రికాలో 3 మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు.. ఇలా డిసెంబర్ 21 వరకు భారత్ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతుంది.
తిరిగి డిసెంబర్ 26న టీమిండియా తెలుపు రంగు జెర్సీల్లో కనిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు టీమిండియా తొలి టెస్ట్ ఆడుతుంది. ఈ పర్యటనలో భారత్ ఈ టెస్ట్ తర్వాత మరో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్ 2024 జనవరి 3 నుంచి 7 మధ్యలో జరుగుతుంది.
మొత్తంగా చూస్తే ఐదు నెలల పాటు సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉండనున్న భారత్.. సౌతాఫ్రికా పర్యటనలో తిరిగి వైట్స్‌లో దర్శనమిస్తుంది. విండీస్‌తో రెండో టెస్ట్ తదుపరి భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. మరో ఐదు నెలల పాటు టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడదని తెలిసి, టెస్ట్ క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో దొరికిన మజా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దొరకదని వారు వాపోతున్నారు. ఒరిజినల్ క్రికెట్ అంటే టెస్ట్ క్రికెటేనని కామెంట్స్ చేస్తున్నారు. భారత టెస్ట్ జట్టు అభిమానులారా.. ఏమున్నా ఈ రోజే ఎంజాయ్ చేయండి.. మరో ఐదు నెలలు చూడాలనుకున్నా కుదరదని సోషల్‌మీడియా వేదికగా మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment