బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాముగిసింది. ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు మొదలైన వర్షం.. ఆఖరి రోజు వరకు వెంటాడింది. వర్షం కారణంగా చివరి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
252/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వర్షం మొదలు కావడంతో దాదాపు గంట సేపు ఆట తుడిచిపెట్టుకుపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు భారత పేసర్లు ఊహించని షాకిచ్చారు.
87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కంగారులు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఉంచింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది.
ఆ సమయంలో వెలుతురు సరిగా లేకపోవడం, తర్వాత వర్షం కురవడంతో ఇక ఆట సాధ్యం కాలేదు. దీంతో అంపైర్‌లు డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రా అవ్వడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బుమ్రాపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్ డ్రా ముగియడం పట్ల సంతృప్తిగా ఉన్నాము. సహజంగా పదే పదే వర్షం అంతరాయం కలిగించడం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాతావరణ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా. ఏదేమైనప్పటికీ సిరీస్ సమం(1-1) సమంగా ఉండడం మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
ఇదే కాన్ఫడెన్స్‌తో మెల్‌బోర్న్‌కు వెళ్తాము. అక్కడ మెరుగ్గా రాణించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. కాగా బ్రిస్బేన్‌లో వాతావరణ పరిస్థితులు బట్టి పూర్తి ఆట సాధ్యం కాదని మాకు తెలుసు. దీంతో నాలుగో రోజు ఆటలో ఫాలో ఆన్ దాటడానికి ఎవరో ఒకరు జట్టు కోసం నిలబడితే బాగున్ను అనుకున్నాము.
ఆ సమయంలో జడేజా అద్భుతంగా ఆడాడు. అంతకంటే ముందు టాపర్డర్‌లో రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో బుమ్రా, ఆకాష్ పోరాడిన తీరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారిద్దరూ నెట్స్‌లో ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అది ఈ మ్యాచ్‌లో కన్పించింది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. బంతితో కూడా మా బాయ్స్ రాణించారు. ముఖ్యంగా బుమ్రా అత్యద్భుతం. అదే విధంగా ఆకాష్ దీప్ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త అయినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్‌లా ప్రదర్శన చేస్తున్నాడు. ఆకాష్ లాంటి క్రికెటర్లు భారత జట్టుకు చాలా అవసరమని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment