వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా తొలి విదేశీ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. డిసెంబర్ 10న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో టీమిండియా ప్రోటీస్ పర్యటన ప్రారంభం కానుంది.
సఫారీలతో సిరీస్‌లకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నవంబర్ 30(గురువారం) ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రోటీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ మరి కొన్నాళ్లు విశ్రాంతి కావాలని బీసీసీఐను అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం ఈ సీనియర్ ద్వయం తిరిగి జట్టులోకి రానున్నట్లు వినికిడి.
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను దక్షిణాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్‌లకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రోహిత్ శర్మ గైర్హజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ప్రోటీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పజెప్పాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 మధ్యలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో రోహిత్ శర్మకు డిప్యూటీగా రాహుల్ వ్యవహరించాడు. ఇప్పుడు హార్దిక్ కూడా దక్షిణాఫ్రికా టూర్‌కు అందుబాటులో లేకపోవడంతో రాహుల్ భారత జట్టు పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది.
సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్..
టీ20 సిరీస్..
డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్)
డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్)
డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్)
వన్డే సిరీస్..
డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్)
డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్)
డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్)
టెస్ట్ సిరీస్..
డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్)
2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
Comments
Please login to add a commentAdd a comment