అహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్ (41), మ్యాడీ గ్రీన్ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్ తలో మూడు వికెట్లు.. ఏడెన్ కార్సన్, జెస్ కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రాధా యాదవ్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్‌ప్రీత్ కౌర్ 24, జెమీమా రోడ్రిగెజ్ 17, తేజల్ హసబ్నిస్ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్ 29 పరుగులు చేసి ఔటయ్యారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment