
4 పరుగులతో భారత మహిళల ఓటమి
స్మృతి, హర్మన్, దీప్తిల ఫిఫ్టీలు వృథా
శతక్కొట్టిన హీథర్‌నైట్
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్‌రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.
ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది.
కదంతొక్కిన హీథర్‌నైట్
ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది.
289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0.
భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0.