రిచా ఘోష్‌ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్‌ సేన ఓటమి | Womens T20 WC: India-W Vs England-W live Match And Updates | Sakshi
Sakshi News home page

Womens T20 WC: రిచా ఘోష్‌ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్‌ సేన ఓటమి

Published Sat, Feb 18 2023 6:24 PM | Last Updated on Sat, Feb 18 2023 9:50 PM

Womens T20 WC: India-W Vs England-W live Match And Updates - Sakshi

రిచా ఘోష్‌ పోరాటం వృథా.. ఒత్తిడిలో హర్మన్‌ సేన ఓటమి
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా వుమెన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్‌-బిలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మస్‌ సేన ఒ‍త్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.

రిచా ఘోష్‌ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్‌ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్‌కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్‌ రేణుకా సింగ్‌ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్‌ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్‌ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్‌ తీశారు.

15 ఓవర్లలో టీమిండియా 93/3
15  ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వుమెన్స్‌ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మంధాన 45, రిచా ఘోష్‌ 17 పరుగులతో ఆడుతున్నారు. భారత్‌ విజయానికి 58 పరుగులు కావాలి.

జెమీమా రోడ్రిగ్స్‌(13) ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
జెమీమా రోడ్రిగ్స్‌(13 పరుగులు) రూపంలో భారత మహిళల జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. సారా గ్లెన్‌ బౌలింగ్‌లో బ్రంట్‌కు క్యాచ్‌ ఇచ్చి రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా వుమెన్స్‌ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

టార్గెట్‌ 152.. 5 ఓవర్లలో భారత్‌ స్కోరు 36/1
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్‌ ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 36 పరుగులు చేసింది. స్మృతి మంధాన 23, జేమీమా రోడ్రి‍గ్స్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ వర్మ 8 పరుగులు చేసి బెల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగింది.

ఐదు వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత టార్గెట్‌ 152
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌.. టీమిండియా వుమెన్స్‌ ముందు 152 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్‌ రేణుకా సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగింది. ఆరంభంలో తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బ్రంట్‌ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్‌ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్‌ తీశారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హెథర్‌నైట్‌ రూపంలో ఇం‍గ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో 28 పరుగులు చేసిన నైట్‌ షపాలీ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

10 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు 72/3
ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ కోలుకుంది. 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. బ్రంట్‌ 35, హెథర్‌నైట్‌ 23 పరుగులతో ఆడుతున్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
భారత మహిళా బౌలర్‌ రేణుకా సింగ్‌ చెలరేగుతుంది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ వుమెన్స్‌ను చావుదెబ్బ కొట్టింది తాజాగా డంక్లీ(10 పరుగులు)ని రేణుకా సింగ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వుమెన్స్‌ ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.

అదిరిన ఆరంభం.. రెండు వికెట్లు డౌన్‌
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఏంచుకున్న భారత్‌కు పేసర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే రేణుకా సింగ్‌.. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ వ్యాట్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చింది. ఆ తర్వాత తన రెండో ఓవర్లో క్యాప్సీని క్లీన్‌బౌల్డ్‌ చేసిన రేణుకా సింగ్‌ రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన టీమిండియా..
మహిళల టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత్‌ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్‌–2లో భాగంగా ఇవాళ మూడో లీగ్‌ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఏంచుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్‌–2లో భారత్, ఇంగ్లండ్‌ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇక భారత్‌ జట్టు ఒక మార్పు చేసింది. దేవికా స్థానంలో శిఖా పాండే తుది జట్టులోకి వచ్చింది.

భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్

ఇంగ్లండ్ మహిళలు తుదిజట్టు: సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్‌), అమీ జోన్స్(వికెట్‌ కీపర్‌), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్

ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్‌ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement