మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-ఏ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను అనధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి మూడో స్థానంలో ఉంది. పాక్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.
భారత్ సెమీస్‌కు చేరాలంటే..?
గ్రూప్ మ్యాచ్‌లన్నీ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు చేరతాయి. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఆదివారం (అక్టోబర్ 13) ఆస్ట్రేలియాతో జరుగబోయే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే.. న్యూజిలాండ్ ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ సెమీస్ చేరాలంటే కివీస్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. లేదంటే కనీసం ఒక్క దాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ కివీస్.. శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలిచి, భారత్.. ఆసీస్ చేతిలో ఓడిందంటే అప్పుడు కివీసే సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక్కడ పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలను సైతం కొట్టి పారేయడానికి వీల్లేదు. పాక్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిచి.. భారత్ ఆస్ట్రేలియా చేతిలో, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడితే పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment