కివీస్‌ ముందు నిలవలేక... | Womens World Cup 2022: India Slip To 62-Run Loss To New Zealand | Sakshi
Sakshi News home page

కివీస్‌ ముందు నిలవలేక...

Published Fri, Mar 11 2022 4:45 AM | Last Updated on Fri, Mar 11 2022 4:45 AM

Womens World Cup 2022: India Slip To 62-Run Loss To New Zealand - Sakshi

పాకిస్తాన్‌తో ఘన విజయంతో ప్రపంచకప్‌ను ప్రారంభించిన భారత మహిళలకు రెండో మ్యాచ్‌లో కలిసి రాలేదు. ఆతిథ్య న్యూజిలాండ్‌తో పోరులో ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబర్చలేక మిథాలీ బృందం చతికిలపడింది. ప్రపంచకప్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ తరహాలోనే కివీస్‌ను నిలువరించలేక భారత్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టు ఆడిన, ఓడిన తీరు పూర్తిగా నిరాశపర్చింది. సింగిల్‌ కూడా తీయని ‘డాట్‌ బంతులు’ భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా 156 (26 ఓవర్లు) ఉన్నాయంటే మన బ్యాటింగ్‌ ఎంత పేలవంగా సాగిందో అర్థమవుతుంది!  

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత మహిళల విజయలక్ష్యం 261 పరుగులు... ఇలాంటి ఛేదనలో శుభారంభం లభించాలి, టాపార్డర్‌ దూకుడుగా ఆడి వేగంగా పరుగులు రాబట్టాలి... కానీ పవర్‌ప్లేలో మన స్కోరు 2 వికెట్లకు 26 పరుగులు అయితే, 20 ఓవర్లు ముగిసే సరికి  50/3... ఇక్కడే జట్టు గెలుపు అవకాశాలు ముగిసిపోయాయి!  మిగిలిన 30 ఓవర్లలో 211 పరుగులు సాధించడం అసాధ్యంగా మారిపోయి భారత్‌ కుప్పకూలింది. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఉండ వచ్చని భావించిన భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎం చుకోగా...చివరకు మంచు ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఛేదన కష్టసాధ్యంగా మారిపోయింది.

గురువారం జరిగిన మహిళల ప్రపంచ కప్‌ లీగ్‌ పోరులో న్యూజిలాండ్‌ 62 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమీ సాటర్‌వైట్‌ (84 బంతుల్లో 75; 9 ఫోర్లు), అమెలియా కెర్‌ (64 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, కేటీ మార్టిన్‌ (41) రాణించింది. అనంతరం భారత్‌ 46.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (63 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. శనివారం జరిగే తమ తర్వాతి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్‌ తలపడుతుంది.  

పూజకు 4 వికెట్లు...
ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే పూజ వస్త్రకర్‌ అద్భుత ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్‌ (5)ను రనౌట్‌ చేయడంతో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. అయితే తర్వాతి నాలుగు వికెట్లకు వరుసగా 45, 67, 54, 49 పరుగుల భాగస్వామ్యాలు కివీస్‌ను నిలబెట్టాయి. మేఘన, జులన్‌ ఓవర్లలో వరుసగా రెండేసి బౌండరీలతో సోఫీ డెవిన్‌ (30 బంతుల్లో 35; 7 ఫోర్లు) దూకుడు కనబర్చింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. డెవిన్‌ను పూజ అవుట్‌ చేయగా, కెర్‌ తన జోరు కొనసాగించింది. 63 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. భారత్‌పై గత ఐదు వన్డేల్లో కెర్‌ వరుసగా 119 నాటౌట్, 67, 68 నాటౌట్, 66, 50 పరుగులు చేయడం విశేషం. రాజేశ్వరి బౌలింగ్‌లో కెర్‌ వెనుదిరిగినా...ధాటిగా ఆడుతూ 60 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న సాటర్‌వైట్‌ ఆపై దీప్తి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగింది. అయితే చివర్లో 31 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసిన భారత్‌ కివీస్‌ను కొంత వరకు నిలువరించింది.  

మిథాలీ పేలవంగా...
ఈ మ్యాచ్‌ కోసం షఫాలీవర్మపై వేటుతో యస్తిక భాటియా (59 బంతుల్లో 28; 2 ఫోర్లు)కు తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం కల్పించడంతో టాప్‌–3 ఎడమచేతివాటం బ్యాటర్లతోనే భారత్‌ బరిలోకి దిగినట్లయింది. అయితే ముగ్గురులో ఎవరూ సఫలం కాలేకపోయారు. ఒత్తిడిలో యస్తిక బంతులు వృథా చేయగా, స్మృతి మంధాన (6), దీప్తి శర్మ (5) విఫలమయ్యారు. 10 ఓవర్లలో భారత్‌ 2 ఫోర్లే కొట్టగలిగింది!అనుభవజ్ఞురాలైన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (56 బంతుల్లో 31; 1 ఫోర్‌) కూడా బాగా నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడమే గగనంగా మారిపోయింది. హర్మన్‌ క్రీజ్‌లోకి వచ్చాక కొంత దూకుడు పెరిగినా... మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. మిథాలీ, హర్మన్‌ క్రీజ్‌లో ఉండటంతో సంచలనంపై ఆశలు ఉన్నా...వరుస బంతుల్లో మిథాలీ, రిచా ఘోష్‌ (0)లను అమేలియా కెర్‌ అవుట్‌ చేయడంతో అదీ పోయింది. 48 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్మన్‌ ఒక్కసారిగా చెలరేగి జెస్‌ కెర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లతో 20 పరుగులు రాబట్టింది. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో అది వృథా ప్రయాసగా మిగిలింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement