మహిళల ఐపీఎల్ (WPL) 2023 సీజన్ మొదటి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడంతో కాస్త బోర్‌గా ఫీలైన అభిమానులకు నిన్న (మార్చి 5) రాత్రి గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలుసిసలైన టీ20 మజాను అందించింది. చివరి నిమిషం వరకు రసవత్తరంగా సాగి ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు), ఆష్లే గార్డెనర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరే (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ ఎక్లెస్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో యూపీ వారియర్జ్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ పక్క వికెట్లు పడుతున్నా కిరణ్ ఒక్కరే జట్టు భారాన్ని అంతా మోయగా.. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో గ్రేస్, సోఫీ జోడీ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి తమ జట్టుకు అపురూపమైన విజయాన్నందించారు. వీరిలో ముఖ్యంగా గ్రేస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 18వ ఓవర్‌లో 20 పరుగులు, 19వ ఓవర్‌లో 14 పరుగులు, చివరి ఓవర్‌లో 25 పరుగులు పిండుకుని వారియర్జ్‌కు బోణీ విజయాన్నందించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో వారియర్జ్ బ్యాటింగ్ సందర్భంగా కనిపించిన ఓ ఆసక్తికర సీన్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించింది. వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును తన బ్యాట్‌పై రాసుకుని బరిలోకి దిగింది. ధోని అంటే పడిచచ్చిపోయే కిరణ్.. స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో ఇలా చేసి ఎంఎస్‌డీపై అభిమానాన్ని చాటుకుంది.
ఎంఎస్‌డీ7 అని రాసివున్న బ్యాట్‌తో బరిలోకి దిగిన కిరణ్.. ధోని తరహాలోనే విధ్వంసం సృష్టించి, తన జట్టు గెలుపుకు బలమైన పునాది వేసింది. కిరణ్ బ్యాట్‌పై ఎంఎస్‌డీ7 అని రాసి ఉండటాన్ని లైవ్‌లో కామెంటర్లు ప్రస్తావించడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. కిరణ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎవరికీ తెలియని కిరణ్.. రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ధోని పేరు పుణ్యమా అని ప్రస్తుతం ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతుంది. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కిరణ్ నవ్‌గరేను ప్రతేక్యంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.
కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన 28 ఏళ్ల కిరణ్ ప్రభు నవ్‌గరే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేశవాలీ టోర్నీల్లో గతంలో మహారాష్ట్ర, ప్రస్తుతం నాగాలాండ్‌కు ఆడుతున్న నవ్‌గరే.. వుమెన్స్ టీ20 చాలెంజ్‌లో వెలాసిటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టీ20ల్లో 150కి పైగా వ్యక్తిగత స్కోర్ సాధించిన ఏకైక భారత బ్యాటర్ కిరణ్ రికార్డుల్లోకెక్కింది. మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ-2022లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ అజేయమైన 162 పరుగులు సాధించి, మహిళల క్రికెట్‌లో డాషింగ్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment