
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals Women) జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. వడోదర వేదికగా బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz)పై నెగ్గింది. అనాబెల్ సదర్లాండ్(Annabel Sutherland) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
ఢిల్లీ ప్లేయర్లలో ఓపెనర్ కిరణ్ నవగిరె (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందివ్వగా... శ్వేత సెహ్రావత్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్) హెన్రీ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ 2 వికెట్లు తీసింది.
అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69; 12 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనాబెల్ (41 నాటౌట్; 4 ఫోర్లు), మరిజాన్ కాప్ (29 నాటౌట్; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేశారు.
యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్ తలా ఒక వికెట్ తీశారు. బెంగళూరులో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.
మహిళల ప్రీమియర్ లీగ్-2025 ఆరో మ్యాచ్: యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్
👉వేదిక: కొటాంబి స్టేడియం, వడోదర
👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్
👉యూపీ స్కోరు: 166/7 (20)
👉ఢిల్లీ స్కోరు: 167/3 (19.5)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనాబెల్ సదర్లాండ్ (రెండు వికెట్లతో పాటు 35 బంతుల్లో 41 పరుగులు నాటౌట్).
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్: మళ్లీ నంబర్‌వన్‌గా శుబ్‌మన్ గిల్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ రెండోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో 2023 నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తొలిసారి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్న గిల్ తాజాగా రెండోసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 796 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులతో ఓవరాల్‌గా 259 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన గిల్‌ను మళ్లీ నంబర్‌వన్ ప్లేయర్‌గా చేసింది. ఇన్నాళ్లు ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (761 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (727 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతుండగా... శ్రేయస్ అయ్యర్ (679 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ (680 పాయింట్లు) తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment