![Wrestling Federation of India Elections: Polling And Result Update Check Here - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/21/ANITA-SANJAY-SINGH.jpg.webp?itok=9BXFUSVP)
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీ వేదికగా ఒలింపిక్ భవన్‌లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈరోజే(గురువారం) వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వీర విధేయుడిగా పేరొందిన సంజయ్.. మాజీ రెజ్లర్ అనిత షెరాన్‌పై విజయం సాధించాడు.
ఏం జరిగిందంటే?
కాగా డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ వివాదాల్లో చిక్కుకుంది. బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష పదవికి అనర్హుడని... అతడిని వెంటనే తప్పించాలంటూ రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది.
అనంతరం డబ్ల్యూఎఫ్‌ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎలక్షన్‌ను నిలిపి వేసింది.
ఈ క్రమంలో చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. అయితే, ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడగా... డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది.
అనిత్ వర్సెస్ సంజయ్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీపడుతున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనిత.. వివాదాస్పద డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ వీర విధేయుడుగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్‌లలో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొనగా చివరికి సంజయ్ పైచేయి సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment