న్యూఢిల్లీ: అతడు టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టి దాదాపు 11 ఏళ్లు పూర్తయ్యాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయం ప్రకారం ఉత్తమ వికెట్ కీపర్లలో తనూ ఒకడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ అయితే, అతడి స్మార్ట్‌నెస్ ఫిదా అయ్యాడు. ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు అయినా, తన ఆటలో మెరుపు మాత్రం తగ్గలేదని అభిమానులు అంటారు. తన పని తాను సక్రమంగా నెరవేర్చుకుపోయేతత్వం.. లెజెండరీ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ కెప్టెన్ జట్టులో ఉన్నంతకాలం అతడికి అవకాశాలు సన్నగిల్లడంతో అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.
ఇక ఇప్పుడు రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో జట్టులో చోటు దక్కించుకునేందుకు నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అయితే, టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా పంతే ఉండాలంటూ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించడం కూడా తనకే చెల్లింది. ఇప్పటికే క్రికెట్ ప్రేమికులకు అర్థమై పోయి ఉంటుంది.. అవును.. వృద్ధిమాన్ సాహా గురించే ఇదంతా. వ్యక్తిగతంగా తాను అనుకున్న శిఖరాలకు చేరుకోలేకపోయినా, మేటి క్రికెటర్‌గా వార్తల్లో నిలవకపోయినా... జట్టు గెలిస్తే చాలు అనే మనస్తత్వం కలిగిన సాహా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది.
ఈ నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడిన సాహా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోని వంటి లెజెండ్‌తో పోటీపడాల్సిన పరిస్థితి కదా. సాహా దురదృష్టవంతుడా? అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు. మన ప్రదర్శనను బట్టే.. మేనేజ్‌మెంట్ జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా అన్న విషయం గురించి నిర్ణయం తీసుకుంటుంది. బాగా ఆడిన వాళ్ల స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు. జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాలి. అంతేగానీ, మనం ఆడామా లేదా అన్నది ముఖ్యం కాదు. నిజం చెప్పాలంటే.. ధోని భాయ్ జట్టులో ఉంటే.. కచ్చితంగా ఆయనే కీపింగ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే, ఎప్పుడో ఒక్కసారి వచ్చిన అవకాశాన్నైనా వదులుకునేందుకు నేను సిద్ధంగా ఉండేవాడిని కాను. నా అరంగేట్రమే చిత్రంగా జరిగింది. 2010 దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన మ్యాచ్. నిజానికి ముందు నేను తుదిజట్టులో లేనని చెప్పారు. కానీ ఆ తర్వాత పిలుపు వచ్చింది. అప్పటి నుంచి కాల్ వచ్చినా రాకున్నా ప్రాక్టీసు చేస్తూ సన్నద్ధంగా ఉండేవాడిని. 2014 తర్వాత.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాతే... నాకు రెగ్యులర్‌గా ఆడే అవకాశం వచ్చింది. అంతకుముందు ఎవరైనా గాయపడినా, లేదంటే ఇతరత్రా కారణాల దృష్ట్యా అందుబాటులో లేకపోయితే.. అప్పుడు మాత్రమే నాకు చాన్స్ ఉండేది.
ఇక గాయాల గురించి ప్రస్తావించగా.. ‘‘2018లో నా భుజానికి గాయమైంది. సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడే ఇంగ్లండ్ సిరీస్ కూడా ఉంది. ఆ సమయంలో దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్ దూసుకువచ్చారు. ముఖ్యంగా పంత్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మీద బాగా ఆడతాడు. తన రాకతో.. జట్టులో స్థానం కోసం నేను ఎంతోకాలం వేచిచూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పునరాగమనం కోసం కఠిన సమయాల్లో ఓపికగా ఉండాలి’’ అని సాహా పేర్కొన్నాడు.
అదే విధంగా ఎల్లప్పుడూ రెండో చాయిస్ వికెట్ కీపర్‌గానే పరిగణింపబడటంపై స్పందిస్తూ.. ‘‘ధోని భయ్యా ఉన్నపుడు.. అంటే కెరీర్ ఆరంభంలోనూ.. ఇక గాయాల కారణంగా స్థానం కోల్పోయి పంత్ వచ్చినపుడు నేనేమీ అనుకోలేదు. ఆటలో ఇవన్నీ సహజం. అయితే, 2014 నుంచి 2018 వరకు నేను ఫస్ట్ చాయిస్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంటుంది. మేనేజ్‌మెంట్ నిర్ణయం మీదనే అన్నీ ఆధారపడి ఉంటాయి. టీ20లు, వన్డేలు ఆడాలని నాకూ ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్ణయాల ప్రకారమే నడుచుకోవాలి కదా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 38 టెస్టులాడిన ఈ బెంగాలీ క్రికెటర్ 1251 పరుగులు చేశాడు. 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమయ్యాడు.
చదవండి: Ind Vs Sl: గంగూలీ, ద్రవిడ్.. వీరోచిత ఇన్నింగ్స్ గుర్తుందా!
Comments
Please login to add a commentAdd a comment