‘‘నా ప్రియమైన సతీమణి... మనం మొట్టమొదటిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం దాకా.. ఈ ప్రయాణంలోని ప్రతీ సెకండ్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు.
ఈ మాట ఎవరు చెప్పారో గానీ.. సరిగ్గా నా కోసం చెప్పినట్లే ఉంది. ప్రతి రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నేను సంపూర్ణమయ్యాను!!
నా ప్రేమ దేవతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ పట్ల ప్రేమను చాటుకున్నాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణికి కవితాత్మక సందేశాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Dear wifey ,
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023
From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕
You make me a better human being every single day.❤️
You complete… pic.twitter.com/1xxe8KqfSt
ఈ సందర్భంగా తన నిచ్చెలితో దిగిన అందమైన ఫొటోలను యుజీ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా ధనశ్రీ సైతం.. ఓ పాటకు తామిద్దరం డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. మూడేళ్లుగా పరస్పర సహకారంతో తమ ప్రయాణం ఇక్కడిదాకా వచ్చిందంటూ భర్త పట్ల ఆప్యాయతను చాటుకుంది.
కాగా టీమిండియా బౌలర్‌గా కెరీర్‌లో తారస్థాయిలో ఉన్న సమయంలో యూట్యూబర్ ధనశ్రీ వర్మను చహల్ పెళ్లాడాడు. 2020, డిసెంబరు 22న గూర్గావ్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, కొన్నాళ్ల క్రితం ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్‌లో చహల్ ఇంటి పేరును తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి.
అంతేకాదు.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ పేరును ముడిపెట్టి అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ క్రమంలో యజువేంద్ర చహల్ స్వయంగా స్పందించి విడాకుల రూమర్స్‌ను కొట్టిపడేశాడు. ధనశ్రీ సైతం భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ పెళ్లిరోజు కూడా నేడు. ఈ సందర్భంగా సతీమణికి విష్ చేస్తూ అందమైన ఫొటోలను పంచుకున్నాడు సంజూ. కాగా తన చిన్ననాటి స్నేహితురాలు చారులతా రమేశ్‌ను ఐదేళ్ల క్రితం వివామమాడాడు సంజూ. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఈ కేరళ బ్యాటర్ మూడో వన్డేలో శతకం బాది టీమిండియాను గెలిపించాడు. మరోవైపు.. చహల్‌కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment