CWC 2023- Ind vs Aus- Mohammad Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి గురించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు షమీ.
ఈ మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ యూపీ బౌలర్.
మూడు ఐదు వికెట్ల హాల్స్
ఈ క్రమంలో.. లీగ్ దశలో తొలుత న్యూజిలాండ్‌పై ఫైవ్ వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లు తీసిన షమీ.. శ్రీలంకపై ఐదు వికెట్లతో చెలరేగాడు.
ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేసర్.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఒక వికెట్‌తో మెరిశాడు.
ఆసీస్‌తో ఫైనల్ ఆడుతున్న సమయంలో తల్లికి అస్వస్థత
ఇలా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో మొత్తం 24 వికెట్ల తన ఖాతాలో వేసుకుని.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే, షమీ ఆసీస్‌తో ఫైనల్ ఆడుతున్న సమయంలో అతడి తల్లి ఆనుం ఆరా అనారోగ్యం పాలయ్యారు.
సహాస్‌పూర్‌లోని తమ నివాసంలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీరసం, జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆనుం ఆరాకు చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువు డాక్టర్ ముంతాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఇన్‌స్టా వేదికగా తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేసిన షమీ.. ‘‘నువ్వే నా సర్వస్వం అమ్మా. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు.
నెట్టింట వైరల్ అవుతున్న షమీ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘అమ్మ తప్పక కోలుకుని త్వరలోనే తిరిగి వస్తారు. ఆమె కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం భయ్యా’’ అంటూ అభిమానులు షమీకి ధైర్యం చెబుతున్నారు.
చదవండి: యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్
Comments
Please login to add a commentAdd a comment