లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో జహీర్ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. జహీర్, ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం మధ్య ప్రస్తుతం ఆర్ధిక పరమైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్యాకేజీ కాస్త అటూ ఇటైనా డీల్‌కు ఓకే చెప్పాలనే జహీర్ భావిస్తున్నాడట.
అన్నీ కుదిరితే జహీర్ ఎల్‌ఎస్‌జీలో మెంటార్షిప్‌తో పాటు బౌలింగ్ కోచ్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్, మోర్నీ మోర్కెల్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఎల్‌ఎస్‌జీ మెంటార్షిప్, బౌలింగ్ కోచ్ పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. జహీర్ స్వతహాగా ఫాస్ట్ బౌలర్ కావడంతో బౌలింగ్ కోచ్ పదవిని కూడా అతనికే కట్టబెట్టాలని ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ భావిస్తుందట. రెండు పదవులు రానుండటంతో ఈ డీల్ పట్ల జహీర్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం.
వాస్తవానికి జహీర్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి ఆశించాడని టాక్. అయితే గంభీర్ పట్టుబట్టడంతో ఆ పదవి మోర్నీ మోర్కెల్‌కు దక్కిందని తెలుస్తుంది. కాగా, ప్రస్తుతం లక్నో హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్న విషయం తెలిసిందే.
జహీర్ గురించి వివరాలు..
జహీర్ గతంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో పని చేశాడు. 45 ఏళ్ల జహీర్ టీమిండియా తరఫున 92 టెస్ట్‌లు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. జహీర్ ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 100 గేమ్‌లు ఆడాడు. జహీర్ చివరిగా 2017లో ఐపీఎల్ ఆడాడు.
లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరి, 2024 సీజన్‌లో చేరలేకపోయింది. లక్నో.. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి 2022 ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025 విషయానికొస్తే.. బీసీసీఐ ఈ నెలాఖరులోగా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఆప్షన్ సహా ఆరు రిటెన్షన్స్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలు భారీ వేలాన్ని రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ ప్రస్తుతానికి అందుకు అనుకూలంగా లేదని టాక్.
Comments
Please login to add a commentAdd a comment