బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు.
రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.
దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్‌జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment