
జాప్యం లేకుండా పరిశ్రమలకు అనుమతులు
నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గానూ వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపే అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను వెంటనే పూర్తి చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖలు తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఆమంచర్ల వద్ద కేటాయించిన భూమికి బదులు కేకేగుంట, అనంతరం వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని పరిశీలించి అప్పగించాలని సూచించారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పీఎంఈజీపీ రుణాలను విరివిగా మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెస్సెమ్‌ఈ పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి నివేదిక పంపాలని ఏపీఐఐసీ అధికారులను సూచించారు. నారంపేట మెగా ఇండస్ట్రియల్ పార్కు వద్ద విద్యుత్, తాగునీటి ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీపీ రుణాల మంజూరు తదితర అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ వివరించారు. జేసీ కార్తీక్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్, ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్, డీటీసీ చందర్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆనంద్