స్టెత్ వేసుకోవాల్సిన వాడు... మెడకు తాడు బిగించుకున్నాడు ఆస్పత్రిలో ఉండాల్సిన వాడు మార్చురీలో పడుకున్నాడు తెల్లకోటులో ఉండాల్సిన వాడు.. తెల్లగుడ్డలో దూరిపోయాడు అల్లారుముద్దుగా పెంచితే అందనంత దూరం పోయాడు తండ్రి పోగుపోగునూ కలుపుతూ బంధం అల్లుతుంటే తనేమో బంధం తెంపుకుని వెళ్లిపోయాడు గాయానికి కట్టుకట్టాల్సిన వాడు... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు జీవితమనే పరీక్షలో ఫెయిలై ఉరితాడుకు వేలాడాడు
ధర్మవరం అర్బన్: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధర్మవరం పట్టణం తారకరామాపురంలో బుధవారం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తారకరామాపురానికి చెందిన రామాంజనేయులు, రాజమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించే రామాంజనేయులు ఆడ పిల్లలిద్దరికీ వివాహాలు జరిపించాడు. చిన్న కుమారుడైన ముక్తాపురం నవీన్‌కుమార్ (23)ను వైద్యుడిగా చూడాలని కలలు కనేవాడు.
ఈక్రమంలోనే ఖర్చుకు వెనకాడకుండా కుమారుడిని చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే ఇంటర్, నీట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీన్ని నవీన్‌కుమార్ అవమానంగా భావించాడు. తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పలేక మదనపడ్డాడు. ఉగాది పండుగ నేపథ్యంలో మంగళవారం ధర్మవరానికి వచ్చిన నవీన్‌కుమార్...రాత్రి తల్లిదండ్రులతో కులాసాగా కబుర్లు చెప్పాడు. అనంతరం తండ్రి రామాంజనేయులు వద్దే పడుకున్న నవీన్‌కుమార్... అందరూ నిద్రపోయాక ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులోని ఇనుపరాడ్డుకు ఉరివేసుకున్నాడు.
బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన తండ్రి పక్కలో ఉండాల్సిన కుమారుడు కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూశాడు. అప్పటికే కసువు ఊడ్చేందుకు షెడ్డులోకి వెళ్లిన రాజమ్మ ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో రామాంజనేయులు కూడా పరుగున వెళ్లి ఇరుగూ పొరుగు సాయంతో కుమారుడిని కిందకు దించి చూడగా, అప్పటికే నవీన్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. వైద్యుడిగా చూడాలన్న కలను... కల్లలు చేసి వెళ్లిపోయావా అంటూ రామాంజనేయులు ఏడుస్తుంటే అతన్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న టూటౌన్ ఏఎస్‌ఐ డోణాసింగ్, జమేదార్ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉగాది రోజున ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment