సాక్షి ప్రతినిధి, అనంతపురం: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేస్తున్నాయి. స్థానిక నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదివి వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత ఆరోపణలు రుజువు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరితే టీడీపీ నుంచి స్పందన లేకపోవడం.. ఇదంతా చూస్తుంటే ‘యువగళం’ మసకబారిందన్న భావన వ్యక్తమవుతోంది. లోకేష్ విమర్శలకు స్థానిక నాయకులు కూడా కనీస ఆధారాలు చూపించలేక ముఖం చాటేస్తున్నారు.
రోడ్లపై చర్చకు రెడీయా..?
కదిరిలో రోడ్ల అభివృద్ధి జరగలేదని, ఉన్నవన్నీ టీడీపీ వేసిన రోడ్లేనని లోకేష్ వ్యాఖ్యానించారు. ‘మీ నాన్న 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. జగన్ ఇప్పటికి సీఎంగా ఉన్నది నాలుగేళ్లే. ఆ పధ్నాలుగేళ్లు.. ఈ నాలుగేళ్లు తీసుకో. ఎవరి పాలనలో ఎక్కువ రోడ్లు వేశారో చూద్దాం. దీనికి నువ్వు రెడీ అయితే చర్చకు ఎక్కడైనా నేను సిద్ధమే. ఊరికే రోడ్డుమీద పదిమందిని పోగేసుకుని మాట్లాడటం కాదు. వేసిన రోడ్లు.. ఖర్చుచేసిన వ్యయం లెక్కలతో రా. నేనూ వస్తా.. తేల్చుకుందాం’ అంటూ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చేసిన సవాల్‌కు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు.
దమ్ముంటే సవాల్ స్వీకరించండి
ధర్మవరంలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆరోపణలు చేసిన లోకేష్‌కు...ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గట్టి షాకే ఇచ్చారు. మీరు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఈ నెల మూడో తేదీన విజయవాడలోని కరకట్ట సమీపంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్దకే వెళ్లారు. మీరు ఉంటున్నది అక్రమమా.. నేను నిబంధనల ప్రకారం చేసింది అక్రమమా? దమ్ముంటే చర్చించేందుకు రండంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. దీనికి టీడీపీ నేతలెవరూ స్పందించలేదు.
జాకీపై చర్చకు నేను సిద్ధం
రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారణంగా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందంటూ లోకేష్ పాదయాత్రలో ఆరోపించారు. అప్పటి మంత్రి పరిటాల సునీత.. జాకీ పరిశ్రమకు అనుమతి వచ్చాక ఏడాదిపాటు పదవిలోనే ఉన్నారు. ఎందుకు పరిశ్రమను ప్రారంభించలేకపోయారు? దీనిపై చర్చించేందుకు నేను సిద్ధం. పరిటాల కుటుంబమైనా.. లోకేష్.. చంద్రబాబు ఎవరైనా సరే చేతనైతే చర్చించేందుకు రండి.. అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. కానీ ఎవరి నుంచీ బదులు సమాధానం రాలేదు.
చెంచాలు కాదు.. నువ్వే చర్చకు రా..!
‘నేను భూకబ్జాలు, దోపిడీలు చేశానని అంటున్నావ్.. నా తాతది 50 ఎకరాలు. మీ తాత ఖర్జూరనాయుడు మీ నాన్నకు రెండెకరాలు ఇచ్చారు. మరి రెండు వేల కోట్ల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనిపై చర్చించేందుకు నీ చెంచాలు కాకుండా లోకేష్ నేరుగా రావాలి’ అంటూ పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ సవాల్ విసిరారు. ‘స్థలం, తేదీ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా ఓకే.. నన్ను అనకొండ అన్నావ్.. నిజమే.. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో నేను అనకొండనే’ అన్నారు. శంకరనారాయణ వ్యాఖ్యలకు ఇప్పటికీ టీడీపీ నుంచి జవాబు లేదు.
ఆరోపణలు రుజువు చెయ్
అవినీతి అక్రమాల్లో దిట్ట అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై లోకేష్ నోరు పారేసుకున్నాడు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పట్టుపట్టారు. పరువు కాపాడుకునేందుకు, అల్లరి చేసి పబ్లిసిటీ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి సత్యమ్మ గుడివద్దకెళ్లి కవ్వింపు చర్యలకు దిగారు. కానీ దుద్దుకుంటపై చేసిన ఆరోపణలను నిగ్గుతేల్చలేక వెనుదిరిగారు. ఇప్పటికీ తాను విచారణకు సిద్ధమని, మీలో ఎవరైనా పుట్టపర్తి నడిరోడ్డులో బహిరంగ చర్చకు రావాలని దుద్దుకుంట సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment