అతనో సామాన్య రైతు. కుటుంబ అవసరాల కోసం ట్రాక్టరు, కారు, రెండు బైక్‌లు | - | Sakshi
Sakshi News home page

అతనో సామాన్య రైతు. కుటుంబ అవసరాల కోసం ట్రాక్టరు, కారు, రెండు బైక్‌లు

Published Fri, May 19 2023 10:01 AM | Last Updated on Fri, May 19 2023 10:07 AM

- - Sakshi

గతంలో కారు, బైక్‌ లాంటి వాహనాలు స్టేటస్‌ సింబల్‌గా ఉండేవి. అబ్బో వాళ్లకు కారుంది... వీళ్లకు ద్విచక్ర వాహనం ఉందని గొప్పగా చెప్పుకునేవాళ్లు. అయితే ఇప్పుడు అవి కనీస అవసరాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బైక్‌ ఉండటమనేది సర్వసాధారణంగా మారిపోయింది.

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ముద్దారెడ్డి, రొళ్ల మండలం జీబీ హళ్లి. సామాన్య రైతు. కుటుంబ అవసరాల నిమిత్తం ట్రాక్టరు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు, కుటుంబ సభ్యులందరి కోసం ఓ కారు, ఎవరికి వారు వెళ్లేందుకు రెండు ద్విచక్ర వాహనాలు కొన్నారు. 

ఈయన పేరు పవన్‌కుమార్‌. అమరాపురం వాసి. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తుంటారు. ఫలితంగా రోజుకు సగటున పెట్రోల్‌కు రూ.600 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.  

సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒక్కో ఇంట్లో అవసరాల నిమిత్తం మూడు – నాలుగు వాహనాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేయక మానదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవి మాత్రమే. జిల్లాకు కర్ణాటక సరిహద్దు పక్కనే ఉండటంతో చాలా మంది పొరుగు రాష్ట్రంలోనే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అన్ని వాహనాలు లెక్క చేస్తే ఇంటికో ఓ వాహనం ఉన్నట్లు చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల వాహనాలు కలిపి మూడు లక్షలు దాటాయి.

అవసరాల నిమిత్తం..
ఒకే కుటుంబంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం మూడు – నాలుగు రకాల వాహనాలు కొంటున్నారు. కుటుంబ సభ్యులందరి కోసం కారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు. జీవన పోషణ కోసం బాడుగ ఇచ్చేందుకు జీపు, సొంత పనులపై తిరిగేందుకు ద్విచక్ర వాహనం. మహిళల కోసం ఎలక్ట్రిక్‌ బైక్‌. బాలికల కోసం స్కూటీ. అబ్బాయిల కోసం యమహా లాంటి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి జిల్లాలో అధికారికంగా మూడు లక్షలు దాటాయి. అయితే కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన వాటితో మరో లక్ష పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇరుగు పొరుగు జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలు ఇంకో లక్ష వరకు ఉంటాయి.

ద్విచక్ర వాహనాలే టాప్‌..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,235 వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా మోటారు బైక్‌లు 2,01,238 ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రం నుంచి వాహనాలు కొనుగోలు చేస్తుండటంతో ప్రతి ఇంట్లో ఒక ద్విచక్ర వాహనం చొప్పున ఉన్నట్లు చెప్పవచ్చు. ఆటో రిక్షాలు 15 వేలు, కార్లు 13 వేలు, గూడ్స్‌ వెహికల్స్‌ 11 వేలు, ట్రాక్టర్లు 11 వేలు, ట్రాలీలు, జీపులు, క్యాబ్‌లు, విద్యాసంస్థల వాహనాలు, డంపర్లు, అంబులెన్సులు, ఓమ్ని బస్సులు, చెట్ల కోత వాహనాలు కలిపి మొత్తం 2.77 లక్షల వరకు ఉన్నాయి.

నెలకు వెయ్యిపైగా రిజిస్ట్రేషన్లు
జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోజూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. అన్ని రకాల వాహనాలు కలిపి సగటున నెలకు వెయ్యి పైగా వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. రోజుకు సరాసరి 37 వాహనాలు చొప్పున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనాలే అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
– కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement