వృద్ధురాలితో బయోమెట్రిక్ వేయిస్తున్న శ్రేయదాస్
ట్రాన్స్‌జెండర్ అంటే సమాజంలో ఓ రకమైన చిన్నచూపు. ‘మూడో’రకం మనుషులంటూ హేళనభావం. అనుచితంగా ప్రవర్తిస్తారని, బెదిరించి డబ్బు వసూలు చేస్తారనే అపవాదు. కానీ అందరు ట్రాన్స్‌జెండర్లూ అలా ఉండరు. మానవత్వం మూర్తీభవించి ఆపన్నులకు అండగా నిలిచేవారు, సమాజానికి సేవ చేయాలని తపనపడే వారూ ఉన్నారు. యాచనకు దూరంగా స్వశక్తితో హుందాగా, గౌరవంగా బతుకుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారిలో శ్రేయదాస్ ఒకరు.
సాక్షి, అనంతపురం డెస్క్: ఉరవకొండ పట్టణానికి చెందిన శ్రేయదాస్ గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నారు. తన క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రశంసలు చూరగొంటున్నారు. తన పనితీరుతో అధికారుల మన్ననలూ పొందుతున్నారు. ఈమె బహుశా రాష్ట్రంలోనే వలంటీరుగా పనిచేస్తున్న ఏకై క ట్రాన్స్‌జెండర్! గౌరవంగా బతకాలన్న దృఢసంకల్పం, సమాజానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
కన్నీటి పయనం..
శ్రేయదాస్ సొంతూరు ఉరవకొండ పట్టణమే. చిన్నప్పుడు అబ్బాయి లాగా ఉండేవారు. తల్లిదండ్రులూ అలాగే అనుకున్నారు. మిగిలిన అబ్బాయిలతో కలసి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. పదో తరగతి వరకు అక్కడే చదివారు. కానీ తాను అబ్బాయిని కాదన్న విషయం శ్రేయదాస్‌కు తెలుసు. ఆ విషయం ఇంట్లో చెప్పాలంటే భయం. చివరికి ఎలాగోలా విషయం బయటపడింది. కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. కుటుంబ సభ్యుల నుంచి ఛీదరింపులు ఎక్కువయ్యాయి. చివరకు తండ్రి కూడా అండగా నిలవలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. తలదాచుకోవడానికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. చాలాకాలం పాటు స్థానిక కందారమ్మ ఆలయమే ఆశ్రయమైంది.
‘ఉన్నత’ లక్ష్యం
ఇంటి నుంచి బయటకొచ్చేసిన తర్వాత శ్రేయదాస్ పొట్ట నింపుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మిగిలిన ట్రాన్స్‌జెండర్ల లాగా యాచించడం తనకు ఇష్టం లేదు. కానీ ఆకలి తీరాలంటే ముందున్న మార్గం అదొక్కటే. అయిష్టంగానే సుమారు మూడేళ్ల పాటు యాచనతో బతుకు నెట్టుకొచ్చారు. ఓ దుకాణం వద్దకు యాచించడానికి వెళ్లిన ఆమె ఇంగ్లిష్ నేమ్‌బోర్డును స్పష్టంగా చదవడాన్ని అక్కడే నిల్చొన్న ఓ వ్యక్తి గమనించారు. ఏమి చదివారంటూ ఆరా తీశారు. టెన్త్ చదివానని, పైచదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. దీంతో గుంతకల్లులోని సత్యసాయి జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయించారు. ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో పీజీ (ఎంఏ) అడ్మిషన్ పొంది ఫస్టియర్ ఉత్తీర్ణులయ్యారు. ఇతరత్రా కారణాల వల్ల సెకండియర్‌లో డిస్‌కంటిన్యూ అయ్యారు. తన చదువుకూ ‘జెండర్’ సమస్య అడ్డొచ్చినప్పటికీ పట్టుదలతో అధిగమించి ముందుకు సాగారు.
స్వశక్తితో జీవనయానం హేళన చేసిన చోటే ప్రశంసలు
శ్రేయదాసుకు వలంటీరుగా గౌరవ వేతనంతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా పింఛన్ కూడా వస్తోంది. ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకుని బ్యూటీషియన్‌గానూ మారారు. ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీషియన్‌గా సేవలందిస్తున్నారు. డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. సొంతింటి నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఇలాంటి’ వలంటీరునా
గ్రామ/వార్డు వలంటీర్ల నియామక నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో శ్రేయదాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన అధికారులు గ్రామ వలంటీరుగా అవకాశం కల్పించారు. 2019 ఆగస్టు 15న గ్రామ వలంటీరుగా సేవలు ప్రారంభించారు. మొదట్లో తనను చాలామంది హేళన చేశారు. ‘ఇలాంటి’ వలంటీరునా తమకు కేటాయించిందంటూ ప్రజలు కూడా చిన్నచూపు చూశారు. కానీ అందరి అపోహలను ఆమె పటాపంచలు చేశారు. ఉత్తమ సేవలతో హేళన చేసిన చోటే ప్రశంసలు చూరగొంటున్నారు. ఈ క్రమంలో ‘సేవామిత్ర’ అవార్డు కూడా పొందారు. ‘ఆపదమిత్ర’గా జిల్లాస్థాయి శిక్షణ తీసుకున్నారు. అందులోనూ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు.
గౌరవంగా బతుకుతున్నా..
వలంటీరుగా చేరినప్పుడు చాలామంది హేళన చేశారు. సొంత కమ్యూనిటీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా కొందరి ప్రోత్సాహం, అధికారుల సహకారంతో ధైర్యంగా ముందుకు సాగాను. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ భారతి మేడం, వీఆర్వో అరుణ మేడం సహకారం మరువలేనిది. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు క్లస్టర్ పరిధిలోని ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆత్మీయురాలిగా చూస్తుండడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో గౌరవంగా బతుకుతున్నా. ట్రాన్స్‌జెండర్లు అందరూ చెడ్డవారు కాదు. మాలోనూ మంచోళ్లు ఉన్నారు. కాబట్టి కొందరి ప్రవర్తనను బట్టి అందరినీ చెడ్డవాళ్లుగా ముద్ర వేయొద్దు. సమాజంలో గౌరవం, సమాన అవకాశాలు లభిస్తే నాలాగా స్వశక్తితో బతకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.
– శ్రేయదాస్, గ్రామ వలంటీరు, సచివాలయం–3, ఉరవకొండ
Comments
Please login to add a commentAdd a comment