కదిరి: ‘ప్రజాస్వామ్యంలో అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించాల్సిందే. ‘స్కిల్’స్కామ్‌లో చంద్రబాబు రూ.241 కోట్లు కొల్లగొట్టాడు. అందుకే ఆయనకు కోర్టు జైలుశిక్ష విధించింది. అయితే ఆయనకు తోటి ఖైదీలతో సమానంగా జైలు భోజనం పెట్టకుండా ఇంటి భోజనం పెట్టడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. భవిష్యత్‌లో ఇంకొందరు ఖైదీలు కూడా తమకూ ఇంటి భోజనం తెప్పించండి అని డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది కదా?’అని హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం ఆయన కదిరి రహదారులు, భవనాల అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
అవినీతి కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబుకు తక్షణం జడ్ ప్లస్ భద్రత తొలగించాలన్నారు. ఆయన భవిష్యత్‌లో మరిన్ని అవినీతి కేసుల్లో అరెస్ట్ కాకతప్పదన్నారు. చంద్రబాబు పాపం పండిందని, ఇన్నాళ్లూ వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారని, ఇక దేవుడు ఆయన్ను క్షమించరన్నారు. పోలీసులు చంద్రబాబును చట్టబద్ధంగానే అరెస్ట్ చేసి, జైలుకు పంపారని, ఇదే కేసులో కొందరు విదేశాలకు పారిపోయారంటేనే ఈ కేసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
అవినీతి తేలడంతోనే అరెస్టు..
పూణేకు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో బాబు ‘స్కిల్’స్కాం వెలుగులోకి వచ్చిందని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే కుంభకోణం బయట పడిందన్నారు. సీమెన్స్ ఎండీ సంతకాలు ఎంఓయూలో వేర్వేరుగా ఉండటంతో లోతైన విచారణ కోసం కేసు సీఐడీకి అప్పగించారన్నారు. ఇందులో ఏడు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.240 కోట్లు మెక్కాడని విచారణలో తేలిందని, అందుకే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. చంద్రబాబుపై ఎప్పుడు ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం చూశామని, ఆయన చేసిన అవినీతి పనులకు జీవితాంతం జైలు జీవితం తప్పదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల నుంచి స్పందన కరువైందని టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారని ఎంపీ గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగింది..
చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడంతో ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరి ఉంటుందని హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ అన్నారు. సోమవారం ఆయన కదిరిలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, పిల్లనిచ్చిన పాపానికి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసి ఆయన కుర్చీని పార్టీని లాక్కున్న ఘనుడు చంద్రబాబు అన్నారు. ఆ నాడు ఎన్టీఆర్ పడిన బాధ రాష్ట్ర ప్రజలందరూ కళ్లారా చూశారని ఎంపీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో చంద్రబాబును ఎదిరించలేక ఆయనతో కలిసి పోయారని, బాబు ఇప్పుడు జైలుకెళ్లడంతో వారు కూడా సంతోషిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు కోర్టు నమ్ముతూ ఆయన్ను జైలుకు పంపడాన్ని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు. 74 ఏళ్ల వయస్సున్న ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఘోరంగా అవమానించారని, ఇప్పుడు అదే 74 ఏళ్ల వయస్సులో చంద్రబాబు జైలుపాలు కావడం దేవుడు రాసిన స్క్రిప్ట్..అన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబుకు గానీ, టీడీపీ నాయకులకు గానీ ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment