ధర్మవరం ముఖచిత్రం
► జనసేన నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి సమీప బంధువైన రాజారెడ్డికి, ఈడిగ వినయ్‌తేజ్ గౌడ్ అనే వ్యక్తికి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలోనే రాజారెడ్డి గాయపడ్డారు. గొడవ విషయం తెలిసిన 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న రూరల్ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ క్షతగాత్రుడిని స్వయంగా పోలీసు వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స చేయించారు. తన ప్రాణాలు కాపాడారని బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జరిగింది ఇదయితే.. చిలకం మధుసూదన్ రెడ్డి మాత్రం కొత్త పల్లవి అందుకున్నాడు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై బురద జల్లేందుకు యత్నించాడు.
ధర్మవరం: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వ లేక నానా యాగీ చేస్తున్నారు. ప్రజల్లో ఉనికి చాటుకునేందుకు వ్యక్తిగత దూషణలకూ పాల్పడుతున్నారు.
‘చిలక’ పలుకులు.. జనం నవ్వులు
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ సీటు ఆశిస్తున్న చిలకం మధుసూదన్ రెడ్డి ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో అశాంతి నెలకొల్పేందుకు నానా యాగీ చేస్తున్నారు. ఎక్కడ చిన్న గొడవ జరిగినా ఎమ్మెల్యేకు ఆపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల తన బంధువైన ఓ వ్యక్తి వ్యక్తిగత కారణాలతో మరో వ్యక్తితో గొడవ పడితే దాన్నీ ఎమ్మెల్యేపై రుద్దేందుకు యత్నించాడు. అయితే, వాస్తవాలు బయటకు రావడంతో జనం ఎదుట నవ్వులపాలయ్యాడు. ఇలాగే, కొన్ని రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటైతే.. చిరు వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటాయంటూ రభస చేసే ప్రయత్నం చేశాడు. అయితే, కుట్ర విషయం గ్రహించి వ్యాపారులు సహకరించకపోవడంతో ఆ ప్లాన్ కూడా బెడిసికొట్టింది.
అభివృద్ధితోనే సమాధానం..
ప్రతిపక్షాల కుట్రలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నారు. నిత్యం ‘గుడ్‌మార్నింగ్’ పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలోనే రూ. 2,283 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయించి రికార్డు సృష్టించారు. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నిధులతో ఆర్‌ఓబీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, నాడు–నేడు, డబుల్‌లైన్ రహదారులు, నేషనల్ హైవే, రిజర్వాయర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ప్రతిపక్షాలు ఎంతలా రెచ్చగొడుతున్నా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత టీడీపీ హయాంతో పోలిస్తే నియోజకవర్గంలో నేడు గణనీయంగా తగ్గిన నేర గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు
ధర్మవరం డివిజన్‌లో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పట్టణంలో రాజారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు సత్వరం స్పందించి ప్రాణాలు కాపాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు వినయ్‌తేజ్‌గౌడ్, విష్ణు, హరినాథ్‌తో సహా 10 మందిపై కేసు నమోదు చేశాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసులు పట్టించుకోలేదని రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు.
– టి. శ్రీనివాసులు, డీఎస్పీ, ధర్మవరం
Comments
Please login to add a commentAdd a comment