‘కూటమి’ సంస్కరణలు అర్థరహితం
ఎన్‌పీకుంట: ప్రభుత్వం తీసుకొచ్చిన అర్ధరోజు కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ అర్థరహితమని, పాత పద్ధతిలోనే కాంప్లెక్స్ సమావేశాలు కొనసాగించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు అర్థరహితంగా ఉన్నాయని విమర్శించారు. ప్రతి నెలా మూడో శనివారం అర్ధరోజు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలంటూ షెడ్యూలు విడుదల చేయడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరమని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం వరకూ పాఠశాలలు నిర్వహించిన ఉపాధ్యాయులు 20 నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించి కాంప్లెక్స్ సమావేశాలకు హాజరుకావడం అసంజసమని, సరైన రవాణా సౌకర్యాలు లేని మారుమూల పల్లెల్లో విధులు నిర్వహించే మహిళా ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందికరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు రామాంజులుయాదవ్, రహీం, షఫీ, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో
30 గొర్రె పిల్లల మృతి
కనగానపల్లి: మండల కేంద్రమైన కనగానపల్లిలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజారి తిక్క బీరప్పకు 300 పైగా గొర్రెలు ఉన్నాయి. వాటిలో చిన్న పిల్లలను గూళ్ల కింద వదిలేసి ఉదయం మేత కోసం గొర్రెల మందను సమీపంలోని పొలాల్లోకి వేసుకొని వెళ్లాడు. అయితే ఆ తర్వాతా గ్రామంలోని ఊర కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి మెడలు, కాళ్లు కొరికేశాయి. దీంతో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో 10 పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. చేతికి వచ్చిన 30 గొర్రె పిల్లలు మృతి చెందటంతో రూ.2 లక్షల దాకా నష్టపోయానని తిక్క బీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.
మంటలు ఆర్పబోయి
వృద్ధుడి మృతి
ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని కాకతీయ డాబా సమీపంలో మామిడి తోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మామిడి తోటను ముదిగుబ్బకు చెందిన కొలిమి నాగప్ప (84) అనే వృద్ధుడు లీజుకు తీసుకొని తోటకు కాపలాగా ఉంటున్నాడు. మంటలను ఆర్పే ప్రయత్నంలో వృద్ధుడు కింద పడిపోయాడు. అయితే మంటలు వృద్ధున్ని చుట్టుముట్టడంతో మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. మృతుని మనువడు రామాంజినేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
● రెండు నెలల పాటు ఎంఎన్‌ఓ సస్పెన్షన్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అనస్తీషియా టెక్నీషియన్ కోర్సు చేస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై మేల్ నర్సింగ్ ఆర్డర్టీ (ఎంఎన్‌ఓ) చిన్నప్పయ్యను రెండు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే... గత నెలలో ఆపరేషన్ థియేటర్‌లో ఎంఎన్‌ఓ చిన్నప్పయ్య అసభ్యంగా ప్రవర్తించాడని సదరు విద్యార్థిని సర్వజనాస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై నెల రోజులు తర్వాత ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఆర్‌ఎంఓ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎన్‌ఓ చిన్నపయ్యను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు.
‘కూటమి’ సంస్కరణలు అర్థరహితం
Comments
Please login to add a commentAdd a comment