
‘అసంఘటిత’ కార్మికులను నమోదు చేయాలి
ప్రశాంతి నిలయం: ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా స్థాయి అమలు కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రెండు లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో నమోదు కావాల్సి ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పనిచేసే చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు తాపీ మేసీ్త్రలు, శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు, రిక్షా డ్రైవర్‌లు, టైల్స్ పరిశ్రమల్లో పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారస్తులను గుర్తించాలన్నారు. ‘ఉపాధి’ కూలీలు, చేనేత కార్మికులు, అంగన్‌వాడీ కార్మికుల వివరాలనూ ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. నమోదైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక యూనివర్సల్ గుర్తింపు కార్డు జారీ చేస్తారని, ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయన్నారు. ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో నమోదైన ప్రతి కార్మికుడికీ ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ప్రయోజనాలు దక్కుతాయన్నారు. దీని గురించి విస్తృత ప్రచారం చేసి కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ అధికారి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి
పుట్టపర్తి అర్బన్: జాతీయ రహదారి 342 నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి పుట్టపర్తి నుంచి గోరంట్ల మండలం, చిలమత్తూరు మండలం కోడూరు వరకూ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఏడాదిగా పనులు సాగుతున్నాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా ఈ మార్గంగుండా రవాణ మెరుగవుతుందన్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన వెంగటగారిపల్లి వద్ద ఉన్న ఘాట్ పనులను పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా భూ సేకరణ పూర్తి కాకపోయినా, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందక పోయినా.. తన దృష్టికి తీసుకురావాలన్నారు. భూముల్లో ఉన్న మట్టి కుప్పలు, రాళ్లు, తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్–342 ఈఈ గిడ్డయ్య, సంబంధిత కంట్రాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
‘ఈ–శ్రమ్’లో వివరాల నమోదుతో
ఎన్నో ప్రయోజనాలు
సమీక్ష సమావేశంలో కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment