
ఎంజాయ్‌మెంట్ చెల్లదు
నదులు జాతీయ సొత్తు. ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ రెవెన్యూలోని కొందరు అధికారులు వాటిని కొందరికి ధారాదత్తం చేశారు. పైసల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఒక్క
సంతకంతో చిత్రావతి నదికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఎంజాయ్‌మెంట్ పేరుతో 43 ఎకరాలు రాసిచ్చేశారు. ఇలా ఎంజాయ్‌మెంట్ హక్కులు
పొందిన బడా రియల్టర్ చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జికట్టి నదీ జలాలకు అడ్డుకట్ట వేశాడు. కింద భాగంలో పొలాలున్న రైతులనూ అష్టకష్టాలు పెడుతున్నాడు. నదికే యాజమాన్య హక్కులు పొందిన రియల్టర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చిలమత్తూరు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ‘చిత్రావతి’ ఒకటి. వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ నదిని చిలమత్తూరు మండలంలో రెడ్డెప్ప శెట్టి అనే వ్యక్తి ఆక్రమించాడు. ఏకంగా బ్రిడ్జి నిర్మించి నీటి వనరులను సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇది అక్రమమని ఇరిగేషన్ అధికారులు తేల్చగా...గతంలో తాను పొందిన ‘ఎంజాయ్‌మెంట్’ పత్రం చూపుతున్నాడు.
రాజేంద్రసింగ్ హయాంలో...
2019 ఎన్నికల సమయంలో చిలమత్తూరు తహసీల్దార్‌గా రాజేంద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో జిల్లా యంత్రాంగం అంతా ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉండగా.. రాజేంద్ర సింగ్ మాత్రం కాసుల కోసం ప్రభుత్వ భూములను ఎడాపెడా పరాధీనం చేశారు. ఈ క్రమంలోనే రియల్టర్ రెడ్డెప్పశెట్టికి జూన్ 18 తేదీన కోడూరు పొలంలో సర్వే నంబరు 661, 680–1,2లలో 43 ఎకరాల నదిని ధారాదత్తం చేశారు. ఆ ఎంజాయ్‌మెంట్ పత్రంతోనే రెడ్డెప్పశెట్టి చిత్రావతి నదిని చెరబట్టి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు.
అధికారులు నోటీసులిచ్చినా...
రియల్టర్ రెడ్డెప్పశెట్టి చిత్రావతికి అడ్డంగా బ్రిడ్జి కట్టి నీటి వనరులు కిందకు వెళ్లకుండా వాడుకుంటుండంతో పాటు నది పోరంబోకు భూములను సైతం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. నదికి ఆవలవైపు భూములున్న రైతులను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’
కథనం ప్రచురించగా... రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సోమవారం అక్రమ బ్రిడ్జిని పరిశీలించారు. రియల్టర్‌కు నోటీసులు జారీ చేశారు. కానీ రియల్టర్ రెడ్డెప్పశెట్టి 2019లో అప్పటి తహసీల్దార్ రాజేంద్రసింగ్ తనకు మంజూరు చేసిన ఎంజాయ్‌మెంట్ పత్రాన్ని చూపుతూ రుబాబు చేస్తున్నాడు. ఇదే పత్రాన్ని తాను 2023లోనే అధికారులకు ఇచ్చానని చెప్పడం గమనార్హం. అయినా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రియల్టర్‌కు ప్రభుత్వ భూములా..?
పోరంబోకు స్థలాలను సాధారణంగా పేదలకు లీజుకు ఇస్తుంటారు. పంటల సాగు, మొక్కల పెంపకం వంటి వాటికి అనుమతి మంజూరు చేస్తారు. అయితే వందల ఎకరాలు కలిగిన రియల్టర్ రెడ్డెప్ప శెట్టికి సుమారు 43 ఎకరాల నదికి ఎంజాయ్‌మెంట్ పత్రాలు మంజూరు చేయడం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని సదరు రియల్టర్ అధికారులు అడిగిన ప్రశ్నలకు వివరణలో పేర్కొనడం విశేషం. ఏ నిబంధన మేరకు నదికి ఎంజాయ్‌మెంట్ అనుమతులు ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
నదులపై రెవెన్యూ పెత్తనం
రియల్టర్‌కు నదిని ధారాదత్తం చేసిన తహసీల్దార్
2019లోనే నదీ పోరంబోకు
43 ఎకరాలకు ఎంజాయ్‌మెంట్
నదిపై ఏకంగా బ్రిడ్జి కట్టించుకున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి
అక్రమ నిర్మాణమని నోటీసులిచ్చిన
ఇరిగేషన్ అధికారులు
బదులుగా గతంలో పొందిన
ఎంజాయ్ మెంట్ కాపీని పంపిన వైనం
చిత్రావతి పరీవాహకంలోని పోరంబోకు భూములకు ఎంజాయ్‌మెంట్ ఇవ్వడం చట్ట విరుద్ధం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నీటి ప్రవాహానికి దూరంగా ఉండి ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉంటేనే ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రిడ్జిని కచ్చితంగా తొలగిస్తాం. అదేవిధంగా పోరంబోకుకు ఇచ్చిన ఎంజాయ్‌మెంట్ రద్దు చేయాలని నోటీసులు అందించాం. ఇందుకు వారం రోజులు గడువిచ్చాం. మాట వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– యోగానంద, ఇరిగేషన్ డీఈ, హిందూపురం
రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
తనకున్న వందల ఎకరాల భూములకు కంచె వేసుకున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి... ఇతర రైతుల పొలాలకు వెళ్లేందుకు ఎప్పటి నుంచో ఉన్న దారిని సైతం మూసివేశారు. దీంతో ఇటీవలే కొడికొండకు చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవ్వరూ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
ప్రభుత్వ భూములూ ఆక్రమణ..?
రియల్టర్ రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూములనూ తన ఆధీనంలో ఉంచుకున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనడంతో పాటు సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తే అసలు విషయాలు నిగ్గు తేలుతాయని ప్రజలు చెబుతున్నారు.

ఎంజాయ్‌మెంట్ చెల్లదు
Comments
Please login to add a commentAdd a comment