కందుల కొనుగోలులో రాజకీయం
రొద్దం: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక అధికారులంతా ఆ పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇలా అన్నింటిలోనూ కూటమి పార్టీల నేతలు చెప్పినట్లే వ్యవహరిస్తున్నారు. చివరకు రైతులకూ రాజకీయం అంటగట్టారు. టీడీపీ మద్దతుదారులైన రైతుల నుంచే కందులు కొనుగోలు చేస్తూ వివాదానికి తెరతీశారు.
కొందరికే సమాచారం ఇచ్చి...
కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం రొద్దం కేంద్రం ఏర్పాటు చేసింది. ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ద్వారా రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తోంది. శనివారం కందులు కొనుగోలుకు సిద్ధమైన అధికారులు కేవలం టీడీపీ మద్దతుదారులైన రైతులకే ముందస్తు సమాచారం ఇచ్చారు. కందులు తీసుకువచ్చేందుకు అవసరమైన సంచులనూ కొందరికే అందజేసి కొనుగోళ్లు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా రైతులు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. పావగడ–పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకూ రాజకీయాలు ముడిపెట్టడం సబబుకాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రైతుల అందోళనతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులే సొంతంగా సంచులు సమకూర్చుకుంటే అందుకు సంచికి రూ.25 చొప్పున చెల్లించాలి కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. ఆందోళనలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్.నారాయణరెడ్డి, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, బూదిపల్లి రామంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
టీడీపీ మద్దతుదారుల నుంచే కొనుగోళ్లు
రోడ్డుపై బైఠాయించిన రైతులు
Comments
Please login to add a commentAdd a comment