నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి కర్ణాటక రాజధాని బెంగళూరులోని మార్తనహల్లికి చెందిన ఎం.రమేష్‌రెడ్డి, చంద్రిక కుటుంబసభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డికి గురువారం వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతల పేరుతో ఆలయంలో విశేష పూజలు నిర్వహించి స్వామి శేషవస్త్రాం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
హక్కుల ఉద్యమ నేత
నరేంద్రసింగ్ బేడీ
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పెనుకొండ: కార్మిక, కర్షక, కూలీ, రైతాంగ హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు సాగించిన మహోన్నత వ్యక్తి నరేంద్రసింగ్ బేడీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక షాదీమహల్‌లో గురువారం నరేంద్రసింగ్ బేడీ సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ... యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా దశాబ్దాలుగా నరేంద్రసింగ్ బేడీ సాగించిన ప్రజా ఉద్యమాలను గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పి సిబ్బందిని నియమించి ప్రజా చైతన్యం కోసం అహర్నిశలు ఆరాటపడ్డారన్నారు. ఆయన పోరాటల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. పేదల అభ్యున్నతి కోసం పరితపించిన బేడీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారన్నారు. కార్యక్రమంలో మాజీ ఉద్యోగులు వెంకటేశ్వర్లు, రామాంజినేయులు, నరసింహమూర్తి, రాయప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి బలవన్మరణం
పుట్టపర్తి అర్బన్: స్థానిక ప్రశాంతి నిలయం – బసంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకో పైలెట్ సమాచారంతో రైల్వే పోలీసులు గురువారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడికి సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. తెల్లని చొక్కా, తెల్లని బనియన్, పంచె ధరించాడు. రైలు దూసుకెళ్లడంతో మృతదేహం ఛిద్రమైంది. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94907 98793లో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.
యువకుడి ఆత్మహత్య
లేపాక్షి: పెళ్లి కాలేదన్న దిగాలుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం కుర్లపల్లికి చెందిన రామాంజినేయులు (26)కు కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఏ సంబంధమూ కుదరలేదు. దీంతో తనకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదేమోనని దిగాలుతో గురువారం ఉదయం లేపాక్షి చెరువు కట్టపై ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వెలుగు సీసీలపై కేసు నమోదు
గోరంట్ల: వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సీసీలతో పాటు మండల సమాఖ్య అధ్యక్షరాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గోరంట్లలోని నాల్గో వార్డులోని అల్లామాలిక్ మహిళ సంఘం వీఓఏగా పనిచేస్తున్న చాకలి వరలక్ష్మిని గతేడాది నవంబర్‌లో విధుల నుంచి తొలగించారు. ఆమెకు ఆరు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెట్టడమే కాకుండా తన చీర లాగి దుర్భాషలాడారంటూ వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగు సీసీ సుధాకర్, చంద్రశేఖర్‌తో పాటు మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగమణిపై కేసు నమోదు చేశారు.
ఉపాధ్యాయుడిని
కులంపేరుతో దూషణ
● టీడీపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ
కేసు నమోదు
కదిరి అర్బన్: అప్పు ఇవ్వని ఉపాధ్యాయుడిని కులం పేరుతో దూషించిన టీడీపీ నేతపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని కే. బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ స్కూల్‌లో ఓబులేసు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆ పాఠశాల పేరెంట్ కమిటీ చైర్‌పర్సన్ భర్త, టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు తరచూ పాఠశాలకు వెళ్లి అధికారం చెలాయించేవాడు. ఈ క్రమంలోనే తనకు రూ.50 వేలు అప్పుగా ఇవ్వాలంటూ కొన్నిరోజులుగా ఓబులేసును వేధిస్తున్నాడు. తనవద్ద అంత డబ్బులేదని చెప్పినా వినిపించుకునే వాడు కాదు. ఈక్రమంలోనే గురువారం ఓబులేసు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపైనే అడ్డగించిన మనోహర్‌నాయుడు డబ్బుల కోసం బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించాడు. దీంతో భయపడిపోయిన ఉపాధ్యాయుడు ఓబులేసు రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మనోహర్‌నాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం
Comments
Please login to add a commentAdd a comment