
తూకాల్లో తేడాలుంటే చర్యలు
ప్రశాంతి నిలయం: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యం, చక్కెర, కందిపప్పు తదితర నిత్యావసరాల తూకాల్లో వ్యత్యాసాలుంటే సంబంధిత డీలర్‌తో పాటు అధికారులపైనా చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలని పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లను ఆదేశించారు. ఎక్కడ బియ్యం పట్టుబడినా కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి నెలా రేషన్ దుకాణాలను పరిశీలించి పనితీరుపై నివేదిక ఇవ్వాలన్నారు. ఎండియూ వాహనాలను, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడంతో పాటు వాటి పనితీరు గురించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఎక్కడైనా లోపాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జిల్లా వెనుకబడి ఉందని, పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్టారెడ్డి, మేనేజర్ అశ్వర్థనాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పక్కాగా అందాలి
కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment