
క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 60.40 క్వింటాళ్లు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం క్వింటా గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.13 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయని మార్కెట్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. సీజన్ ముగుస్తుండటంతో పాటు ధరలు ఆశించినంత లేకపోవడంతో రైతులు ఎండుమిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారని, దీంతో మార్కెట్‌కు వచ్చే సరుకు తగ్గిందని ఆయన వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ ఉద్యోగుల బదిలీలు రద్దు
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అనంతపురం రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ యూనస్, రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు, పెనుకొండ సబ్ రిజిస్ట్రారు వెంకటనాయుడు, సీనియర్ అసిస్టెంట్లు జయదీప్, శ్రీనివాసరెడ్డి తదితరులను డిప్యుటేషన్‌పై విజయవాడలోని ఐజీ కార్యాలయానికి రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. అయితే బదిలీ ఉత్తర్వుల్లో 45 సంవత్సరాలలోపు వయస్సు నిబంధనతోపాటు డైరెక్టు రిక్రూట్ అయి ఉండాలనే నిబంధనలు ఉండడంతో వారందరూ బదిలీకి అనర్హులుగా గుర్తించి ఐజీ కార్యాలయ అధికారులు జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా వెనక్కు పంపారు. వీరందరిని తిరగి వారి స్థానాలకు కేటాయించనున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి తెలిపారు.
కలెక్టరేట్‌లో
‘టమాట’ కంట్రోల్ రూం
ప్రశాంతి నిలయం: జిల్లాలో టమాట పండించే రైతులకు మార్కెటింగ్‌కు సంబంధించి సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో 08555289431 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా రైతులు 1,013 హెక్టార్లలో టమాట సాగు చేశారని, పంట విక్రయానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. రైతులు 9182361127 (మార్కెటింగ్ శాఖ అధికారి), 7995086791 (జిల్లా ఉద్యాన అధికారి) నంబర్లకు కూడా ఫోన్ చేసి సమాచారం పొందవచ్చన్నారు.
బుగ్గలో శివరాత్రి
ఉత్సవాలు ప్రారంభం
తాడిపత్రి రూరల్: ప్రసిద్ధ శైవక్షేత్రం బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నందీశ్వరుని చిత్ర పటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి.. ఎగురవేశారు. అంతకు మునుపు బుగ్గరామలింగేశ్వర స్వామి మూలవిరాట్‌కు అగ్ని నివేదన చేశారు. అక్కడి నుంచి అగ్నిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో అగ్గి రాజింపచేసి ముట్టించారు. ఉదయం గణపతి పూజ, అగ్ని మదనం, వాస్తు బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పార్వతీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు

క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు
Comments
Please login to add a commentAdd a comment