ఫారెస్ట్ అధికారిపై అవినీతి ఆరోపణలు
మడకశిర: స్థానిక రేంజ్ ఫారెస్ట్ అధికారి కుళ్లాయప్ప అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గురువారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన అంశాలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి. కట్టెల వ్యాపారులు, రైతులు తదితరుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు.ఈ అక్రమాలకు పెనుకొండ రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి ఊతమిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. కాగా, కుళ్లాయప్ప అవినీతిపై ఇటీవల కొందరు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేకపోవడంతో చివరకు సోషల్ మీడియా ద్వారా ఆయన అక్రమాలు బహిర్గతం చేసినట్లుగా తెలుస్తోంది.
ఎడ్ల బండి బోల్తా – పలువురికి గాయాలు
అమరాపురం: ఎడ్ల బండి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు... అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన మారెక్క, లక్ష్మమ్మ, రామాంజప్ప గురువారం ఉదయం ఎడ్ల బండిపై వడ్ల బస్తాలు వేసుకుని కె.శివరం గ్రామంలో ఉన్న మిషన్ వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలో కాడెద్దులు బండిని ఓ పక్కకు లాక్కొని వెళ్లడంతో బోల్తాపడింది. బండిపై ఉన్న ముగ్గురు కిందపడ్డారు. మారెక్కకు ఎడమ చెయ్యి విరిగింది. నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మ, రామాంజప్పకు మూగ దెబ్బలు తగిలాయి. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మారెక్కను మడకశిరలోని ప్రభుత్వాప్పత్రికి 108 అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.
ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడి మృతి
పావగడ: స్థానిక శని మహాత్మ సర్కిల్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు మంజునాథ్ (40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గురువారం ఉదయం 11 గంటల సమయంలో సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చెత్తను శుభ్రం చేస్తుండగా ఎస్‌ఎస్‌కే సర్కిల్ నుంచి ఆర్‌జే సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ టైర్ తగలడంతో మంజునాథ్ తలకు బలమైన రక్తగాయమైంది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరు జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. మృతుడి కుమార్తె నందిని ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మంజునాథ్ మృతి విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజేష్, ముఖ్యాధికారి జాఫర్ షరీఫ్, కౌన్సిలర్లు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర సంతాపం ప్రకటించారు.
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
రొళ్ల: తన భార్య మంజుల కనిపించడం లేదంటూ గురువారం సాయంత్రం పోలీసులకు భర్త శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... రొళ్ల మండలం కేపీ తండా గ్రామానికి చెందిన చిన్నవెంకటప్ప కుమారుడు శ్రీనివాసులుకు 13 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15న సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మంజుల వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆమె కోసం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 99724 84670 సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment