దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Published Mon, Mar 3 2025 12:53 AM | Last Updated on Mon, Mar 3 2025 12:52 AM

దూసుక

దూసుకొచ్చిన మృత్యువు

‘నాన్నా.. అమ్మ ఎప్పుడొస్తుంది? నాకు లడ్డూ తెస్తోందా?’ అంటూ సరస్వతి రెండేళ్ల కుమార్తె జ్యోత్స్న అమాయకపు మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మర్తాడు నుంచి ఒడిబియ్యం పోసుకుని తోబుట్టువులతో కలిసి రాయంపల్లిలోని మెట్టినింటికి వస్తున్న సరస్వతి రోడ్డు ప్రమాదంలో తన నాలుగు నెలల కూతురుతో పాటు మృతి చెందింది. వంటమాస్టర్‌ అయిన సతీష్‌ కాన్పు కోసం భార్య సరస్వతిని పుట్టింటికి పంపి.. పెద్ద కుమార్తె జ్యోత్స్నను తానే చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం కుమార్తెను బంధువుల వద్ద ఉంచి కర్ణాటకలోని చేళ్లగురికిలో వంట పనికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ‘ఈరోజు మీ అమ్మ, బుజ్జి పాప వస్తారు. నీకు లడ్డూ కూడా తెస్తారు’ అని కుమార్తెతో చెప్పాడు. అంతలోనే భార్య, చిన్నకుమార్తె మృతి చెందారన్న వార్తతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన రెండేళ్ల కుమార్తె ‘నాన్నా.. అమ్మ ఎక్కడ? నాకు లడ్డూ కావాలి’ అంటూ అమాయకంగా అడగడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సతీష్‌ కన్నీరు మున్నీరుగా విలపించాడు.

కూడేరు/గార్లదిన్నె/ఉరవకొండ: గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన జంగం పార్వతమ్మ, బసవరాజు (లేట్‌) దంపతులకు లీలావతి(45), పుష్పావతి, యోగేశ్వరి(40), సరస్వతి(37) సంతానం. పెద్ద కుమార్తె లీలావతికి కళ్యాణదుర్గం మండలం అప్పిలేపల్లికి చెందిన శ్రీకంఠంతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు అచ్యుత్‌ కుమార్‌ ఉన్నాడు. మణికంఠ అనంతపురం శివారులోని వడియం పేట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. రెండో కుమార్తె కుషావతికి వివాహమై మర్తాడులోనే ఉంటున్నారు. మూడో కుమార్తె యోగేశ్వరికి కళ్యాణదుర్గం మండలం పూలంపల్లికి చెందిన రుద్రేశ్వర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. యోగేశ్వరి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఇక చిన్న కుమార్తె సరస్వతికి ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సతీష్‌తో వివాహమైంది. ఈమె రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరస్వతికి ఆదివారం మధ్యాహ్నం పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టిన అనంతరం అత్తారింటిలో వదిలి పెట్టేందుకు అక్కలు లీలావతి, యోగేశ్వరి, లీలావతి కుమారుడు అచ్యుత్‌కుమార్‌తో కలిసి మర్తాడు నుంచి ఆటోలో రాయంపల్లికి బయల్దేరారు. ఇదిలా ఉండగా.. కళ్యాణదుర్గం, అనంతపురానికి చెందిన తరుణ్‌, యశ్వంత్‌, రంజిత్‌, మరో ఇద్దరు యువతులు పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని కారులో అనంతపురం వస్తున్నారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య మలుపు వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. దీంతో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ఉన్న సరస్వతి తలకు, ముఖానికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. యోగేశ్వరి, లీలావతి, చంటి పాప, అచ్యుత్‌ కుమార్‌తో పాటు ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

108కి సమాచారం ఇచ్చినా..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్‌ సకాలంలో రాలేదు. కొద్దిసేపటి తర్వాత సీఐ రాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంటి పాప, లీలావతి, యోగేశ్వరి మృతి చెందారు. అచ్యుత్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెద్ద కుమార్తె జ్యోత్స్న

రోడ్డు ప్రమాదంలో

నలుగురు దుర్మరణం

మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు,

ఒక చంటిపాప

ప్రసవమైన నాలుగు నెలల తర్వాత పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టించుకున్న ఆమె.. అక్కలను తోడుగా తీసుకుని అత్తారింటికి ఆటోలో బయల్దేరింది. చంటిబిడ్డను ముద్దాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య ఆదివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, నాలుగు నెలల చంటి పాప దుర్మరణం చెందారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
దూసుకొచ్చిన మృత్యువు 1
1/4

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు 2
2/4

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు 3
3/4

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు 4
4/4

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement